Pages

Sunday, September 18, 2016

గజ్జలు దయ్యం

కొండాపురంలో‌ రాము-సోము అనే మిత్రులు, సాయంత్రం పశువుల్ని ఇంటికి తోలుకొచ్చిన తర్వాత, పట్నంలో సినిమా చూసేందుకు వెళ్ళారు. వాళ్ళు వెనక్కి తిరిగి వచ్చేసరికి బాగా ఆలస్యమైంది. బస్సు వాళ్లని రోడ్డులో వదిలి వెళ్ళిపోయింది. ఊరు ఇంకొక రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇద్దరూ నడిచి వెళ్తున్నారు. ఆరోజు అమావాస్య, కటిక చీకటిగా ఉంది. అయినా తెలిసిన దారే, కనుక కబుర్లు చెప్పుకుంటూ పోతున్నారు మిత్రులిద్దరూ.అంతలో పక్కనే ఉన్న పొదల్లోంచి చిన్నగా గజ్జెల శబ్దం అయ్యింది- ఘల్లు ఘల్లు మని. రాము అగ్గిపుల్ల వెలిగించి, ఆ వెలుతురులో చూశాడు- అక్కడ ఏమీ కనబడలేదు. అంతలోనే దగ్గర్లో వేరే చోటనుండి శబ్దం వినవచ్చింది. అగ్గిపుల్లలన్నీ అయిపోయేంత వరకూ వెతికారు ఇద్దరూ- ఒక చోట వెతికితే మరొక చోటునుండి శబ్దం వినిపిస్తున్నది! ఇక ఇద్దరికీ‌ చెప్పలేనంత భయం వేసింది. ఒకరి చేతులొకరు పట్టుకొని, ఊపిరి బిగబట్టి పరుగు పరుగున ఊరు చేరుకున్నారు. తాము దయ్యాల బారినుండి 'ఆ దేవుడి దయవల్లే తప్పించుకున్నాం' అనుకున్నారిద్దరూ.
ఇల్లు చేరుకున్నాడు కానీ, రాము మనసంతా గజ్జెల మీదనే ఉంది. పడుకున్నాక కొంతసేపటికి మళ్ళీ వినబడింది గజ్జెల శబ్దం. కెవ్వున అరిచి కూర్చున్నాడు. ఇంట్లో వాళ్ళు పరుగెత్తుకొని వచ్చారు- కాపలా కుక్క కాలికి ఉన్న గజ్జెల్ని చూపించి, పడుకోబెట్టారు.
సోము కూడా రాత్రి లేచి కూర్చున్నాడు. అతనికీ వినబడింది గజ్జెల శబ్దం. ఇంట్లో వాళ్ళు పాపాయి కాలికి ఉన్న గజ్జెల్ని చూపించారు. ఊరుకొమ్మన్నారు.
తెల్లవారాక కూడా రాము-సోములు తేరుకోలేదు. దయ్యాల భయంతో మంచం పట్టారు. రాను రాను కృశించి పోయారు. ఊళ్ళో వాళ్లందరూ వచ్చి చూసి వెళ్తున్నారు. వాళ్లందరికీ కూడా, రాత్రిపూట ఆ దారిలో దయ్యాల గజ్జెల శబ్దం వినబడటం మొదలు పెట్టింది. అందరూ ఆ దారిని వదిలి, వేరే దారుల్లో తిరుగుతున్నారిప్పుడు. మెల్లగా ఆ దారుల్లోనూ గజ్జెల శబ్దాలు మొదలయ్యాయి. ఊళ్లో వాళ్ళు ఇక రాత్రిపూట బయటికి రావటమే మానుకున్నారు.చివరికి ఒకరోజున అందరూ కలిసి డబ్బులిచ్చి, ఒక భూతవైద్యుడిని పిలిపించుకున్నారు. ఊరికి పట్టిన బెడదను పోగొట్టమని. 1008 నిమ్మకాయలు, 108 పాపరకాయలు, 11నల్లకోళ్ళు, 1 నల్లమేక సమర్పించుకున్నారు. అమావాస్యరోజు రాత్రిపూట ఆయన పూజ మొదలుపెట్టుకున్నాడు. అన్ని రోడ్లూ తిరిగి పూజలు చేశాడు; ఏవేవో అరిచాడు. చివరికి "ఇక దయ్యం పారిపోయింది- మీలో ధైర్యవంతులు ముగ్గురు నాతోబాటు ఇక్కడే పడుకోండి" అన్నాడు.
కొంచెం సేపైందోలేదో, గజ్జెల శబ్దం మళ్ళీ మొదలయ్యింది! ఈసారి మరింత దగ్గరగా వినబడుతున్నది! ముగ్గురు ధైర్యవంతులూ కాలిబిర్రున పరుగెత్తారు. మాంత్రికుడికీ భయం వేసింది. పారిపోతూ రాయికి తట్టుకొని క్రింద పడిపోయాడు. దెబ్బకు జ్వరం వచ్చేసింది. మాంత్రికుడూ మంచం ఎక్కాడు.
ఊళ్ళోవాళ్లకు ఇక దిక్కు తోచలేదు. అందరూ కలిసి దండోరా వేయించారు- గజ్జెల దయ్యాన్ని పారద్రోలిన వాళ్లకు 50వేల రూపాయల బహుమానం ప్రకటించారు.
ఊళ్ళో కంసాలి ఒకడు ముందుకొచ్చాడు చివరికి- "నాకు పదివేలిస్తే చాలు- గజ్జెల శబ్దం ఇక వినబడదు" అన్నాడు. ఎవ్వరూ నమ్మలేదు అతన్ని. చివరికి, ఎవ్వరూ 50వేలకు కూడా ఆశపడకపోయేసరికి, దిగివచ్చారు. కంసాలినే ప్రయత్నించమన్నారు. ముందస్తుగానే పదివేలూ ఇచ్చేశారు.
ఆ తర్వాత మూడు రోజులకు నిజంగానే గజ్జెల దయ్యం మాయమైపోయింది. ఊరంతా ప్రశాంతత అలముకున్నది!
ఇక ఊళ్ళో వాళ్ళకు ఆపుకోలేనంత ఉత్కంఠ- 'కంసాలి దయ్యాన్ని ఎలా పారద్రోలాడు?' అని. అందరూ పందాలమీద పందాలు వేసుకున్నారు. కంసాలి మాత్రం‌పెదవి విప్పలేదు. చివరికి అందరూ కలిసి "నువ్వా రహస్యం చెప్పావంటే మిగిలిన ఉమ్మడి సొమ్ము- నలభైవేలూ నీకే ఇచ్చేస్తాం" అని ఆశచూపారు. కంసాలి కరిగాడు- "ముందే ఇవ్వాలి ఆ సొమ్ము కూడా" అన్నాడు. "రహస్యం చెప్పేసిన తర్వాత 'ఓస్ ఇంతేనా' అనకూడదు" అన్నాడు. "నన్ను ఏమీ చెయ్యకూడదు" అన్నాడు. అన్నిటికీ ఒప్పుకున్నారు ఊళ్లోవాళ్ళు.
కంసాలి ఇంటికి వెళ్ళి ఒక పెద్ద పెట్టెను తీసుకొచ్చాడు. గట్టి ఇనుపతీగలతో, బలంగా ఉందా పెట్టె. దానిలో ఒక యాభైకి పైగా ఎలుకలున్నై. ప్రతిదాని కడుపుకూ పొడవాటి, సన్నటి తీగ- ప్రతి తీగకూ ఒక చిన్న గజ్జె కట్టి ఉన్నై. "ఇదిగో- ఇదే, గజ్జెల దయ్యం" అన్నాడు కంసాలి.
ఊళ్ళో వాళ్ళు బిక్కమొఖం వేశారు. "ఇంకా అర్థం కాలేదా?" అన్నాడు కంసాలి. "మా ఇల్లు ఊరి చివర్లో ఉంది- ఇంటినిండా ఎలుకలు చేరుకున్నాయి. పిల్లిని పెట్టుకున్నా పని జరగలేదు- అది పాలు పెరుగుల్ని తిన్నంతగా, ఎలుకల్ని పట్టట్లేదు. అందుకని నేనో ఉపాయం చేశాను- బోను పెట్టి, చిక్కిన ఎలుకకు చిక్కినట్లు ఓ సన్నటి తంతి, ఒక చిన్న గజ్జె కట్టటం మొదలెట్టాను. ప్రతిరోజూ రాత్రిపూట ఎలుకల్ని ఆహారంకోసం వదుల్తాను- తెల్లవారగానే వాటికి కట్టిన తీగల్ని లాగి, అన్నిటినీ బోనులో పెట్టేస్తాను మళ్ళీ. అలా బందీ అయిన ఎలుకల పుణ్యమా అని, మిగిలిన ఎలుకలేవీ నా యింట్లోకి రాలేదు! మీరేమో వాటిని చూడకనే దయ్యం అనుకున్నారు. నేనేం చెయ్యను? అయినా ఇప్పుడు, మీరంతా కలిసి యాభైవేలు ఇచ్చారు కాబట్టి, నేనీ ఎలుకల్ని పక్కన పెట్టి, ఒక మంచి-గట్టి-ఇల్లు కట్టుకుంటాను- ఎలుకలు రాని ఇల్లు! ఎలుకలబోను అవసరమే ఉండదిక!" అన్నాడు కంసాలి తాపీగా.
ఊళ్ళోవాళ్లకు కంసాలిని కొట్టాలనిపించింది. అయినా ముందుగానే మాట ఇచ్చారు గనక, ఏమీ అనలేక ఊరుకున్నారు. 'భయపడ్డవాళ్ళు నష్టపోతారు' అని నిజంగా అర్థమైంది వాళ్లకి!

No comments:

Post a Comment