Pages

Friday, July 22, 2016

భోజన ప్రియుడు

భోజన ప్రియుడు
.
మహేంద్రపురాన్ని పాలించే నరేంద్రుడు భోజనప్రియుడు. భోజనం గురించి తప్ప, అతను ఇంక దేని గురించీ పట్టించుకునేవాడు కాదు. అసలు విరామమే లేకుండా, ఎప్పుడూ ఏదో ఒకటి తింటూ ఉండేవాడు. పైగా 'ఇలా తినగలగడం ఒక కళ!' అని చెప్పేవాడు.
రాజ్యంలోని మేటైన వంటవాళ్ళు ఆయన వంటశాలలో ఉండేవాళ్ళు. మహారాజుకి ప్రతిరోజూ కొత్త కొత్త వంటకాలు చేసి పెట్టేవాళ్ళు. మొదట్లో వాళ్ళ వంటకాలన్నీ రాజుకు అమోఘంగాను, అద్భుతంగాను అనిపించేవి. ఏ పూటకాపూట ఆయన వాటిని గొప్పగా మెచ్చుకుంటూ, ఆనందంగా తినేవాడు. కానీ ఎందుకనో, మరి రోజు రోజుకీ వాళ్ల పనితనం తగ్గింది. వాళ్ల చేతి వంటలు రాను రాను వెగటు పుట్టించసాగాయి.
ఒకరోజు అతను మంత్రి సుధాముడిని పిలిచి, "మంత్రివర్యా, ఎందువల్లనో మన వంటవాళ్లు తమ పనిని బాగా చేయలేకపోతున్నారు. వాళ్ల వంటకాల్లో రుచి ఉండటం లేదు. వండినవే మళ్లీ మళ్లీ వండుతున్నట్లున్నారు. పాత రుచులు నాలుకకు వెగటు పుట్టిస్తున్నాయి. మీరు మన సైనికుల్ని దేశం నలుమూలలకూ పంపించండి. దేశంలో ఉన్న మేటి వంటగాళ్ళను రప్పించి పనిలో పెట్టండి" అన్నాడు.
దేశం నలుమూలల నుండి వచ్చిన మేటి వంటగాళ్లను త్వరలోనే నరేంద్రుడి ముందు హాజరు పరిచాడు సుధాముడు. నరేంద్రుడు వాళ్ళకు కొన్ని పరీక్షలు పెట్టాడు. అందులో విజేతలుగా నిలిచినవారిని ఆస్థాన వంటవాళ్ళుగా నియమించాడు. అట్లా మళ్లీ కొత్త వంటకాలతో హాయిగా, తృప్తిగా భోజనం చేయసాగాడు.
కొన్నాళ్లకి ఎందుకనో, మరి ఈ వంటకాలలో కూడా రుచి అందలేదు. ఇప్పుడాయనకు ఏం తిన్నా రుచించట్లేదు. రాజ వైద్యుడు అన్నాడు "మహారాజా, అన్ని అనారోగ్యాలకూ మూలం అజీర్తి. మీకు ఆహారం సరిగా జీర్ణం కావటం లేదు. ఆహారాన్ని మీరు వెండి పాత్రలో సేవిస్తున్నట్లున్నారు. వేడి వేడి ఆహారాన్ని పసిడి పాత్రలో పెట్టుకొని తింటేనే, మీ సమస్య దూరమయ్యేది. నిజం చెప్పాలంటే, ఇన్నాళ్లూ మీరు పసిడి కంచంలో అన్నం తినకపోవటంవల్లనే మీకు ఈ అనారోగ్యం వచ్చింది" అని.
నరేంద్రుడికి మొదటి ఇష్టం భోజనమైతే, రెండవ ఇష్టం బంగారమే! ఆయనకు రాజవైద్యుడి సలహా చాలా నచ్చింది. ఇక ఆనాటి నుండి ఆయన భోజనం అంతా శుద్ధమైన బంగారు పళ్ళాలలోనే! పసిడి పాత్రలో తినడం వల్ల ఆయన ఆరోగ్యం మెరుగైంది. వంటకాల రుచి కూడా పెరిగింది!
ఇంత గొప్ప సలహా ఇచ్చినందుకు రాజవైద్యుడిని మెచ్చుకొని ఘనంగా సన్మానించాడు నరేంద్రుడు. అయితే కొంత కాలానికి, పసిడి పళ్ళాల భోజనం కూడా రుచి తగ్గింది! "బహుశ: ఈ పాత్రల తయారీలో ఏదో లోపం ఉండచ్చు" అనుకున్నాడు రాజు. దాంతో రోజుకొక కొత్త బంగారు పళ్ళెం వాడుకలోకి తెచ్చారు.
బంగారు పాత్రలు ఎన్ని మార్చినా, వంటగాళ్ళను మార్చినా, విదేశాలనుండి రకరకాల సుగంధ ద్రవ్యాలను తెప్పించి వాడినా, ఇప్పుడిక రాజుకి అవేవీ మునుపటిలా రుచించటంలేదు. దాంతో ఆయనకు రుచికరమైన ఆహారం గురించేగాక, తన ఆరోగ్యం గురించి కూడా పెద్ద దిగులు పట్టుకున్నది.
ఒకనాడు మంత్రి సుధాముడు "ప్రభూ! జంతువులు వేటాడి ఆహారాన్ని సంపాదించుకుంటాయి. వేట మాంసం రుచికరంగా ఉండటమేకాక, ఆరోగ్య పరంగా కూడా చాలా విలువైనది అని చెబుతారు. తమరి సమస్యకు వేట సమాధానం ఇస్తుందేమో. ఒకసారి వేటకు వెళ్దామా?" అన్నాడు.
రాజుగారికి ఆ ఆలోచన నచ్చింది. వేటమాంసం తలచుకొని నోరూరింది కూడా. "సరే! వెంటనే వెళ్దాం" అని మంత్రి వెంట అడవికి బయలుదేరాడు.
ఎప్పుడూ తినడమే తప్ప ఏనాడూ పనిచేయని నరేంద్రుడు, అడవిలోకి సగం దూరం వెళ్లేసరికి అలసిపోయాడు. "మంత్రివర్యా, చాలా అలసటగా ఉంది. కాసేపు ఇక్కడ విశ్రమించిన తరువాత మనం వేటను కొనసాగిద్దాం" అన్నాడు.
"మహారాజా, అడవిలో ఇది భయంకరమైన పులులు, సింహాలు సంచరించే ప్రదేశం. ఇట్లాంటి చోట వేటాడవచ్చు గానీ, విశ్రమించడం ఏమంత మంచిది కాదు. ఈ ప్రాంతాన్ని దాటి వెళ్లాక మరెక్కడైనా విశ్రమిద్దాం- ఇక్కడ వద్దు" చెప్పాడు సుధాముడు.
కానీ మహారాజు వినలేదు. "నా వల్ల కాదు" అని గుర్రం దిగి, విల్లూ బాణాలూ ప్రక్కన పెట్టి, ఓ చెట్టుకు చేరగిల పడబోయాడు. ఆ చెట్టుకు కొద్ది దూరంలోనే ఒక పులి, తను కూడా విశ్రాంతి తీసుకుంటూ ఉండింది. వీళ్ల మాటలకు చికాకు పడిందో ఏమో, అది పెద్దగా గాండ్రిస్తూ వీళ్ళ మీదికి వచ్చింది. చేతిలో ఆయుధాలు లేని నరేంద్రుడు, పులి గాండ్రింపు వింటూనే భయంతో పరుగులు పెట్టసాగాడు. రాజుగారిని కాపాడటం కోసం ఆయన వెనకే పరుగు పెట్టాడు సుధాముడు. వాళ్ళ వెంట పడిన పులి కొద్దిసేపటికి విరమించుకొని తన దారిన తాను పోయింది.
అట్లా వాళ్ళిద్దరూ అడవిని దాటి, రాజ్యపు పొలిమేరల్లోని ఒక ఊరు చేరుకున్నారు.
నరేంద్రుడు ఏనాడూ అంత దూరం పరుగెత్తలేదు. ఈ పరుగుతో ఆయన బాగా అలసిపోయాడు. అంతేకాక ఆయన ప్రొద్దుట్నుంచీ ఏమీ తినలేదు కూడానూ- దాంతో ఆయనకు విపరీతమైన ఆకలి వేసింది. అలసటతోటీ, ఆకలితోటీ అడుగు ముందుకు వేయలేకపోయాడాయన.
ఆయన్ని బుజ్జగిస్తూ, బ్రతిమిలాడుతూ, అక్కడికి దగ్గరలోనే ఉన్న ఒక ఇంటి వరకూ చేర్చాడు సుధాముడు. ఆ ఇంటి యజమాని రంగయ్య మంచివాడు. నరేంద్రుడి అవస్థను చూసి అతను కరిగిపోయాడు. వాళ్ళిద్దరినీ సాదరంగా ఇంటిలోనికి ఆహ్వానించి, తమ కోసం వండి పెట్టుకున్న వేడి వేడి భోజనాన్ని వాళ్లకు వడ్డించాడు. ఆకలితో అలమటించిపోతున్న నరేంద్రుడు తాను ఏం తింటున్నాడో కూడా గమనించకుండానే, గబగబా అన్నం మొత్తం తినేశాడు. కడుపునిండా మజ్జిగ త్రాగాడు.
"ఆహా, రంగయ్య గారూ! మీ భోజనం అమృతం లాగా ఉంది. ఇంత మంచి వంటకాలని నేను ఎప్పుడూ తినలేదు. ఇంత గొప్ప వంటకాలని తయారుచేయడం మీరు ఎక్కడ నుండి నేర్చుకున్నారు? మీరు మజ్జిగ ఇచ్చిన పాత్రని ఏ లోహంతో తయారు చేశారు? నేనెప్పుడూ మజ్జిగ ఇంత కమ్మగా ఉండడం చూడనే లేదే! శుద్ధమైన బంగారు పాత్రలలో చేసినా కూడా, వంటలు ఇంత రుచిగా అనిపించలేదు మరి! మీరు వడ్డించిన ఆకులో ఏదో రహస్యం ఉందేమో! అది ఏ ఆకు?!" అని అడిగాడు నరేంద్రుడు సంబరపడిపోతూ.
నరేంద్రుని మాటలకు చిన్నగా నవ్వి "అయ్యా, మేం వడ్డించిన భోజనం బాగుందంటే, దానికి కారణం మేం ఏదో గొప్పగా వండడం కేనే కాదు- అసలు సంగతి ఏమంటే 'మీరు ఆకలితో ఉన్నారు'! ఆకలితో ఉన్నవాళ్ళకు చద్దన్నం కూడా పరమాన్నంలా అనిపిస్తుంది. మీకు మజ్జిగను ఇచ్చిన ఆ పాత్ర, ఏ లోహంతోనూ చేసింది కాదు- అది మామూలు మట్టి పాత్ర! ఇక ఆ ఆకంటారా, అది మామూలు విస్తరాకు! ఆకలితో తింటే అన్నం కూడా అమృతంలా వుంటుంది; అదేపనిగా తింటే అమృతంగా కూడా చేదుగా ఉంటుంది. అయినా తిన్నం తినడానికి బంగారు పాత్రలెందుకు, శుభ్రమైన ఆకు సరిపోతుంది కదా!" అన్నాడు రంగయ్య.
ఇన్నాళ్లూ తాను చేసిన తప్పిదం ఏమిటో ఒక్క మాటుగా తెలిసివచ్చింది, నరేంద్రుడికి: 'తను రుచి వెంట, సంపద వెంట పడ్డాడు; ఆకలిని పట్టించుకోలేదు! అసలు వంటకు రుచినిచ్చేది ఆకలే!'
ఆనాటి నుండి అతను వ్యర్థపు అలవాట్లను వదిలేసాడు. నిజమైన రాజుగా ప్రజాసంక్షేమం కోసం పాటుపడ్డాడు. కొద్ది కాలంలోనే 'భోజనప్రియుడు' అనే అపఖ్యాతిని వదిలించుకొని, 'జనప్రియుడు' అయ్యాడు.
.

No comments:

Post a Comment