నాగ సముద్రంలో నివసించే రామయ్య, లక్ష్మమ్మలకు ఇంగ్లీషు రాదు. ఊళ్ళో చిన్న అంగడితో మొదలు పెట్టుకొని, మెల్ల మెల్లగా ఆర్థికంగా ఒక స్థాయికి చేరుకున్నారు వాళ్ళు. వాళ్లకు ఒక్కగానొక్క కూతురు రమ్య. రమ్యకూ ఇంగ్లీషు రాదు.
"ఇన్ని ఆస్తిపాస్తులు ఉండీ ఏం ప్రయోజనం? మాకెవ్వరికీ ఇంగ్లీషు రాదే? కనీసం ఇంగ్లీషు వచ్చిన అల్లుడు వస్తే కదా, మా ఇంట్లో నాలుగు మంచి ముక్కలు వినిపించేది?" అనుకునేవాళ్ళు వాళ్ళు.
ఇంగ్లీషు వచ్చిన అల్లుడి కోసం వాళ్ళు నాగసముద్రంలో అంతటా గాలించారు- అయితే నాగ సముద్రంలో అసలు చదువుకున్నవాళ్ళే దొరకలేదు!
ఇంగ్లీషు వచ్చిన అల్లుడి కోసం వాళ్ళు నాగసముద్రంలో అంతటా గాలించారు- అయితే నాగ సముద్రంలో అసలు చదువుకున్నవాళ్ళే దొరకలేదు!
ఒకనాడు భార్యాభర్తలిద్దరూ కూర్చొని "దగ్గరి పల్లెల్లో విచారిద్దాం. మనకు కావలసిన అల్లుడికి ఆస్తి పాస్తులేవీ లేకున్నా పర్లేదు" అని మాట్లాడుకున్నారు. ఆ సమయానికే అటుగా పోతున్న దాసప్ప చెవిన పడ్డాయి ఆ మాటలు. "దొరికింది! గిరాకీ దొరికింది!" అని అతని హృదయం గంతులు పెట్టింది. "వెయ్యి అబద్ధాలు ఆడైనా ఒక పెళ్ళి చెయ్యమన్నారు. ఇప్పుడు నేను చెయ్యబోయే పని చాలా పుణ్య కార్యం" అని అతను మరుసటి రోజు ఉదయాన్నే రామయ్య, లక్ష్మమ్మ దగ్గరకు వచ్చి, "మీ అమ్మాయికి తగిన పిల్లవాడు ఒకడున్నాడమ్మా! మంచి అందగాడు, చదువుకున్నవాడు, చక్కని కుర్రాడొకడు ఉన్నాడు. మాట్లాడమంటారా?" అన్నాడు.
లక్ష్మమ్మ ముఖం విప్పారింది. ఆమె దాసప్పకు ముందు చెంబెడు చక్కెర నీళ్ళూ, అవి తాగాక కప్పు నిండా వేడి వేడి టీ నీళ్ళూ తెచ్చి ఇచ్చి "మీరు ఆ మాత్రం పుణ్యం కట్టుకున్నారంటే, మీ రుణం ఉంచుకోం. ఏమంటే మాకు చదువుకున్న అల్లుడే కావాలి- అదొక్కటీ గుర్తుంచుకోండి చాలు!" అన్నది.
"మీరు నిశ్చింతగా ఉండండి- మా మేనల్లుడే ఒకడున్నాడు. చక్కని కుర్రవాడు. వాడు కాకపోతే ఇంకా చాలామంది ఉన్నారు. మీకు తగిన అల్లుడిని నేను తెస్తాగా" అని ఏవేవో చెప్పి పోయాడు దాసప్ప.
అసలు సంగతేంటంటే ప్రక్కనే ఉన్న బసినేపల్లిలో రమేష్ అనే మోసగాడు ఒకడు ఉండేవాడు. వాడికి ఇప్పుడు పెళ్ళి చేసుకోవాలని మోజు పుట్టింది. అందుకని అతను దాసప్పకు ప్రత్యేకంగా కొన్ని డబ్బులిచ్చి "ఇదిగో మామా, నువ్వేం చేస్తావో తెలీదు- నాకు మంచి సంబంధం చూసి పెట్టు" అన్నాడు.
అసలు సంగతేంటంటే ప్రక్కనే ఉన్న బసినేపల్లిలో రమేష్ అనే మోసగాడు ఒకడు ఉండేవాడు. వాడికి ఇప్పుడు పెళ్ళి చేసుకోవాలని మోజు పుట్టింది. అందుకని అతను దాసప్పకు ప్రత్యేకంగా కొన్ని డబ్బులిచ్చి "ఇదిగో మామా, నువ్వేం చేస్తావో తెలీదు- నాకు మంచి సంబంధం చూసి పెట్టు" అన్నాడు.
దాసప్ప ఇప్పుడు వాడిని రమ్యకు ముడి-పెడదామనుకున్నాడు. ఆ సంబంధం గురించి చెప్పగానే రమేష్ ఎగిరి గంతు వేసాడు. "కానీ ఒరే, వాళ్ళ అల్లుడికి ఇంగ్లీషు బాగా వచ్చి ఉండాలటరా, నీకు ఇంగ్లీషు వచ్చా?" అని అడిగాడు దాసప్ప.
"ఓఁ ఐదో క్లాసులో నన్ను మించినవాడే లేకుండె!" అన్నాడు రమేష్.
"మరి వాళ్ళు కొంచెం బలం ఉన్నవాళ్ళు.." అన్నాడు దాసప్ప.
"నాకూ ఉన్నదిలే మామా, బలం!" అన్నాడు రమేష్.
మరుసటి రోజున దాసప్ప, రమేష్ ఇద్దరూ నాగసముద్రంకి వచ్చారు. రామయ్య, లక్ష్మమ్మ వారిని ఆహ్వానించారు. రమేష్ కొత్త బట్టలు వేసుకొని, రోల్డ్ గోల్డ్ ఉంగరాలు, చైను, వాచి పెట్టుకున్నాడు. ఓ పెద్ద సెల్‌ఫోను కూడా అద్దెకు తెచ్చుకున్నాడు. వాటిని చూసి "అబ్బో! పిల్లవాడిది గొప్ప కుటుంబమే" అన్నది లక్ష్మమ్మ దాసప్పతో గుసగుసగా.
"మరేమనుకున్నారు, వాడిదంతా లక్ష్మీ రేఖ" అన్నాడు దాసప్ప, చకచకా వాళ్ళిచ్చిన స్వీటు తింటూ.
అంతలో రమేష్ "నాకు ఇంగ్లీషు కూడా వచ్చండీ, మీరు ఇంగ్లీషు వచ్చిన అల్లుడి కోసం చూస్తున్నారటగా, దాసప్ప మామ చెప్పాడు" అన్నాడు.
"ఏది బాబూ! ఒకసారి ఇంగ్లీష్‌లో మాట్లాడు" అన్నది లక్ష్మమ్మ, మురిపెంగా.
"ఏది బాబూ! ఒకసారి ఇంగ్లీష్‌లో మాట్లాడు" అన్నది లక్ష్మమ్మ, మురిపెంగా.
రమేష్ తడుముకోకుండా వెంటనే ABCDEFGH అన్నాడు.
రామయ్య అతనికేసి ఒకలాగా చూసాడు. వెంటనే రమేష్ నవ్వుతూ రామయ్య చేతులు పట్టుకొని, "హౌ ఆర్యూ? హౌడూయుడూ?" అన్నాడు.
రామయ్య ముఖం వెలగటం చూసి "ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్- హౌ ఐ వండర్ వాట్యూ ఆర్!" అన్నాడు రమేష్.
"భలే భలే- అంటే ఏంటి నాయనా?" అన్నది లక్ష్మమ్మ, ముచ్చట పడుతూ.
"స్టార్‌లాగా వెలిగే ముఖం మీది- మరి మీరు నిజంగానే గొప్ప స్టార్ కాదు గద?!" అన్నాడు రమేష్ గొప్పగా ముఖం పెట్టి.
"అబ్బ మా కాబోయే అల్లుడికి ఇంగ్లీషే కాదు- తెలుగు కూడా ఎంత బాగా వచ్చో!" అని మురిసిపోయింది లక్ష్మమ్మ.
"నువ్వు ఎంతవరకూ చదివావు బాబూ?" అని అడిగాడు రామయ్య, కొంచెం అనుమానంగా.
రమేష్ ఏదో అనబోయేంతలో పోస్టుమ్యాన్ వచ్చి 'పోస్టు' అని గట్టిగా అరిచాడు. లక్ష్మమ్మ బయటికి వచ్చి చూస్తే ఓ ఉత్తరం! ఆమె దాన్ని లోనికి తీసుకొచ్చి, అందరికేసీ చూసి, ఏం చెప్పాలి- ఈ ఊళ్లో ఒక్కరికి కూడా చదువు రాదు నాయనా! నువ్వే దీన్ని కాస్త చదివి పెట్టు" అని కాబోయే అల్లుడి చేతికి ఇచ్చింది.
రమేష్ ఒక్క క్షణం బిత్తరపోయాడు. ఈ స్థితిని అతను ఊహించలేదు. అతను ఆ ఉత్తరాన్ని పట్టుకొని తిప్పి తిప్పి చూస్తూ గట్టిగా ఏడవటం మొదలు పెట్టాడు. అక్కడున్న వాళ్లందరికీ ఏమీ అర్థం కాలేదు. అయినా మరి కాబోయే అల్లుడు ఏడుస్తున్నాడంటే మరి- 'ఎవరో ఒకరు చనిపోయే ఉంటారు' అనిపించింది అందరికీ.
తక్షణం అక్కడ ఉన్న వాళ్లందరూ బిగ్గరగా ఏడవటం మొదలు పెట్టారు. వాళ్ల ఏడుపులు విని చుట్టు ప్రక్కల ఇళ్ళలోంచి అమ్మలక్కలు చాలామంది బిరబిరా వచ్చారు. వీళ్ళ ఏడుపులు విని వాళ్ళూ శోకాలు మొదలు పెట్టారు.
ఇట్లా కొంత సేపు జరిగాక, బయటి ఊరినుండి అటుగా వెళ్తున్న యువకుడొకడు "అయ్యా! దూర ప్రయాణంలో ఉన్నాను. త్రాగేందుకు కొంచెం మంచి నీళ్ళిస్తారా?" అన్నాడు బయటినుండి. అంతలోనే వీళ్ళు ఏడవటం చూసి, "ఎందుకమ్మా ఏడుస్తున్నారు?" అని అడిగాడు లక్ష్మమ్మని.
లక్ష్మమ్మ గుండెలు బాదుకుంటూనే ఆ ఉత్తరాన్ని అతని చేతుల్లో పెట్టింది. అతను ఆ ఉత్తరాన్ని చదివి, గట్టిగా నవ్వి, "దీనికి మీరంతా ఎందుకేడుస్తున్నారు, సంతోష-పడాలిగాని?! మీ పెద్దబ్బాయికి కొడుకు జన్మించాడట!" అనే సరికి అందరూ నోళ్ళు వెళ్ల బెట్టారు.
వెంటనే రామయ్య రమేష్ కాలర్ పట్టుకొని "ఏరా! ఎందుకురా, ఏడ్చావు?! మర్యాదగా ఇప్పుడైనా నిజం చెప్పు!" అన్నాడు. "మరండీ, నాకు అసలు చదవటం రాదు కదండీ, ఆ సంగతి గుర్తొచ్చి ఏడ్చాను- అంతేనండి!" అని కాలర్ విడిపించుకొని పారిపోయాడు రమేష్.
దాసప్ప కూడా పంచె సర్దుకుంటున్నవాడు సర్దుకుంటున్నట్లే తటాలున పారిపోయాడు.
వాళ్ళ మోసానికి రామయ్య నోరు తెరిచాడు.
అంతలో ముందుగా తేరుకున్న లక్ష్మి ఆ వచ్చినతని చెయ్యి పట్టుకొని "బాబూ! నీకు పెళ్లైందా? ఎంత వరకూ చదివావు? ఇంగ్లీషు వచ్చా? మీ వాళ్ళు ఏం చేస్తుంటారు?" అని వరస ప్రశ్నలు కురిపించింది.
రమ్య అదృష్టం, అతనికి ఇంకా పెళ్ళి కాలేదు; తగిన సంబంధం కోసం చూస్తున్నాడు; కుటుంబం మంచిది; ఆరోజే చిన్న ఉద్యోగం కూడా దొరికింది- అన్నిటినీ మించి అతనికి రమ్య, వాళ్ల ఊరివాళ్ళు అందరూ నచ్చారు! రమ్యకు కూడా అతను నచ్చేసాడు- ఇంకేముంది? నెల తిరిగే సరికల్లా రమ్య పెళ్ళి ఆ కుర్రాడితో ఘనంగా జరిగింది!
ఎట్టకేలకు రామయ్య-లక్ష్మమ్మలకు ఇంగ్లీషు అల్లుడు దొరికాడు!
కథ: మహేంద్ర వర ప్రసాద్, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం, నాగ సముద్రం, అనంతపురం జిల్లా.
కథ: మహేంద్ర వర ప్రసాద్, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం, నాగ సముద్రం, అనంతపురం జిల్లా.
No comments:
Post a Comment