Pages

Monday, December 26, 2016

దుర్యోధనుని చెల్లెలి కథ

దుర్యోధనుని చెల్లెలి కథ

కౌరవులు ఎంతమంది అనగానే ఠక్కున వందమంది అని చెప్పేస్తాం. దృతరాష్ట్రుని పిల్లలందరూ కౌరవులే అనుకుంటే కనుక 102 మంది కౌరవుల లెక్క తేలుతుంది. ఎందుకంటే దృతరాష్ట్రునికీ, సుఖద అనే చెలికత్తెకీ యుయుత్సుడు అనే కుమారుడు జన్మిస్తాడు. ఇక కౌరవులకు దుస్సల అనే చెల్లెలు కూడా ఉంది. ఈ ఇద్దరితో కలుపుకొని కౌరవులు 102 మంది!

జననం
వ్యాసుని అనుగ్రహం వల్ల గాంధారి గర్భాన్ని ధరించింది. అయితే కాలం గడుస్తున్నా తనకి సంతానం కలగకపోగా, తన తోటికోడలు కుంతికి ధర్మరాజు జన్మించాడు. దీంతో అసూయతో రగిలిపోయిన గాంధారి తన కడుపులో ఉన్న పిండాన్ని తన చేతులతోనే నాశనం చేసుకునేందుకు ప్రయత్నిస్తుంది. అదే సమయానికి అక్కడికి చేరుకున్న వ్యాసుడు, తన వరం వృధా పోదనీ, ఆ మాంసపు ముద్దలని నూరు కుండలలో ఉంచమనీ... వాటి నుంచి నూరుగురు కుమారులు ఉద్భవిస్తారనీ పేర్కొంటాడు. అయితే తనకి అందరూ మగపిల్లలే కాకుండా ఒక్క ఆడపిల్ల కూడా ఉంటే బాగుండు అనుకుంటుంది గాంధారి. ఆమె కోరికను వ్యాసుడు మన్నించడంతో 101 కుండలలో ఆమె గర్భస్థ శిశువుని భద్రపరుస్తారు. అలా జన్మించిన 101వ శిశువే దుస్సల.
వివాహం
దుస్సల బాల్యం గురించి మహాభారతంలో ప్రస్తావన చాలా తక్కువగా కనిపిస్తుంది. అయితే నూరుగురు సోదరులకు తోడు ఐదుగురు పాండవులు కూడా కలిసి పెరగడంతో బహుశా ఆమె వారందరి సోదర ప్రేమను పొంది ఉంటుందనడంలో సందేహం లేదు. దుస్సలకి యుక్తవయసు రాగానే సింధు రాజ్యాధిపతి అయిన జయద్రధునితో వివాహం జరుగుతుంది. ఇతను ఎవరో కాదు... మనం తరచూ వినే ‘సైంధవుడే’! సింధు రాజ్యాధిపతి కాబట్టి జయద్రధునికి ఆ పేరు వచ్చింది. సైంధవుడు మహా క్రూరుడు. పైగా స్త్రీలోలుడు. ఒకరోజు వనవాసంలో ఉన్న ద్రౌపది చూసి మోహిస్తాడు. ఆమె ఎంతగా వారిస్తున్నా కూడా వినకుండా ఆమెను ఎత్తుకుని వెళ్లేందుకు ప్రయత్నిస్తాడు. ఇంతలో ఆశ్రమానికి చేరుకున్న పాండవులు, విషయాన్ని తెలుసుకొని ద్రౌపదిని వెతుక్కుంటూ బయల్దేరతారు. ద్రౌపదిని బలవంతంగా ఎత్తుకువెళ్తున్న సైంధవుడు కంట పడటంతో, వారి క్రోధానికి అంతులేకుండా పోతుంది. అయితే దుస్సల సౌభాగ్యం కోసం అతడిని విడిచిపెట్టమంటూ ధర్మరాజు వారించడంతో.. అతని చావచితక్కొట్టి, గుండు గొరిగించి వదిలిపెడతారు పాండవులు. అలా దుస్సల కారణంగా సైంధవుని ప్రాణం నిలుస్తుంది.
తనకు జరిగిన అవమానాన్ని తట్టుకోలేని సైంధవుడు, శివుని కోసం ఘోరర తపస్సుని ఆచరిస్తాడు. అర్జునుడు మినహా, మిగతా పాండవులందరినీ ఒక్కరోజు పాటు యుద్ధంలో నిలువరించగల వరాన్ని పొందుతాడు. ఆ వరంతోనే చక్రవ్యూహంలో పాండవులను నిలువరించి, అభిమన్యుడి చావుకి కారణం అవుతాడు. కురుక్షేత్ర సంగ్రామంలోని 14వ రోజున అర్జునుడు, తన కుమారుడైన అభిమన్యుని చావుకి ప్రతీకారంగా సైంధవుని సంహరించడంతో సైంధవుని చరిత్ర సమాప్తమవుతుంది.
అర్జునునితో సంధి
కురుక్షేత్ర సంగ్రామం తరువాత ధర్మరాజు హస్తినాపురానికి రాజుగా నియమితుడవుతాడు. అదే సమయంలో జయద్రధుని వారసునిగా, అతని కుమారుడైన సురధుడు సింధు రాజ్యపు సింహాసనాన్ని చేజిక్కించుకుంటాడు. హస్తినాపుర సింహాసనం మీద ఉన్న ధర్మరాజు ఒకనాడు అశ్వమేధయాగాన్ని తలపెడతాడు. ఇందులో భాగంగా యాగాశ్వం సింధురాజ్యం వైపు పరుగులు తీస్తుంది. ఆ అశ్వాన్ని కాపాడేందుకు దాని వెనుకనే అర్జునుడూ బయలుదేరాడు.

యాగాశ్వం తమ రాజ్యం వైపుగానే వస్తోందని తెలిసిన సురదుడు, అర్జునుడి చేతిలో చావు తప్పదన్న భయంతోనే గుండాగి చనిపోతాడు. సురధుని కుమారుడు మాత్రం అర్జునుని ఎదుర్కొనేందుకు సిద్ధపడతాడు. కానీ మహామహావాళ్లే అర్జునుని ముందు నిలవలేకపోయినప్పుడు, అతను ఎంతసేపని తన పోరుని సాగించగలడు. అందుకే ‘తమ మధ్య ఉన్న వైరాన్ని మర్చిపోయి, తన మనవడిని కాపాడమంటూ’ దుస్సల అర్జునుని కోరుకోవడంతో అతడిని సింధు రాజ్యానికి అధిపతిగా నియమించి వెనుదిరుగుతాడు అర్జునుడు. అలా దుస్సల విచక్షణతో కౌరవ, పాండవుల మధ్య దీర్ఘకాలంగా ఉన్న వైరాన్ని నిలిచిపోతుంది

No comments:

Post a Comment