Pages

Monday, December 26, 2016

* అగ్ని దేవుడు

* అగ్ని దేవుడు

జీవితంలో ఎదురయ్యే క్లేశాలనూ, వినాశాలనూ, తప్పిదాలనూ, నిర్మూలించి సర్వతోముఖ శ్రేయస్సును అందించే అగ్ని తత్త్వం అపూర్వం.

• పాపమే అంటని అగ్నిదేవుడు సకల వ్యాపియై తన జ్వాలల ద్వారా లోకాన్ని పునీతం చేసి సత్యరూపంగా చిత్రిస్తుంటాడు.

భారతీయ సంస్కృతికీ, సంప్రదాయానికీ ఆలవాలమైన ప్రాకృతిక సౌందర్యం మానవ మనుగడకు ఊతమందిస్తూ రక్షణ కవచమై అలరారుతుంది. మనిషి ప్రకృతిని ఆరాధిస్తే, ప్రకృతి కూడా మనిషిని ఆదరిస్తుంది. ఆలంబనై నిలుస్తుంది. పరస్పర సహకారంతో మనుగడ సాగించడం ప్రకృతి ప్రణాళిక. భూమి, నీరు, గాలి, అగ్ని, ఆకాశమనే అయిదు తత్త్వాలే సృష్టికి మూలహేతువులై పంచభూతాలుగా ప్రకృతిలో భాగమయ్యాయి. మనిషి ముఖ్య ఆధారాలై భాసిల్లుతుంది.

సర్వాగ్రణీ, సర్వ ప్రథముడూ అయిన అగ్నిదేవుడు ప్రకృతి శక్తులలో ప్రముఖుడూ, ప్రధానుడు. భూమండలంలోని ప్రముఖ తత్త్వాలకు ఆలంబన అగ్నితత్త్వం. సత్యనిష్ఠతో ప్రేరితమైన అగ్నిజ్వాల లోకంలోని సమస్తమునూ పవిత్రీకరిస్తుంది. పావనం చేస్తుంది. అందుకే స్వర్గ ప్రాక్తికి సాధనం అగ్ని ఆరాధన అంటోంది వేదం.

‘" ఓం అగ్నిమీళే పురోహితం
యజ్ఞస్య దేవ మృత్విజమ్|
హోతారం రత్నధాతమమ్|| "

సృష్టి యజ్ఞానికి ప్రథమ పురోహితుడూ, లోకంలోని అందరి ఆహుతులనూ మోసుకెళ్లి దేవతలకర్పించే ఏకైక యాగపురుషుడూ అగ్నిదేవుడు

అగ్ని దేవునికి రెండు తలలు , ప్రతి తలకి రెండు కొమ్ములు ,ఏడు నాలుకలు, ఏడు చేతులు, మూడు కాళ్ళు ఉంటాయి. ఈయనకు కుడి వైపు భార్య స్వాదా దేవి, ఎడమవైపు స్వాహా దేవి ఉంటుంది. దైవ కార్యాలలో ఈయనకు సమర్పించిన ఆజ్యం హవిస్సు అన్నిటిని స్వాహా దేవి స్వీకరించి ఏ దైవం నిమిత్తం మనం ఆ హోమం చేస్తున్నామో వారికి అందిస్తుంది. అదే విధంగా పితృ కార్యాలలో స్వదా దేవి తన పాత్ర పోషిస్తుంది. ఈయన వాహనం మేక. అన్నిటినీ ఈయన ఆరగించ గలడు కావునా ఈయన్ని ” సర్వభక్షకుడు ” అంటారు. ఇంకా ఈయనకు హుతవాహనుడు, దేవముఖుడు, సప్తజిహ్వుడు, వైశ్వానరుడు, జాతవేదుడు అని కూడ పేర్లు.

సృష్టి యజ్ఞపు అంతరార్థాన్ని ఆవిష్కరించే వాడూ, నిత్యనిజసత్య స్వరూపుడూ, అనంత మహిమాన్వితుడూ అయిన అగ్నిదేవుడు దేవతలందరితో భువికి అరుదెంచి ప్రసన్నుడై ఆశీర్వదించేలా వారందరినీ హవిస్సులతో తృప్తిపరచి నిష్పక్షపాతంగా లోకాన్ని సుఖిక్షం చేసే దేవదేవుడు.

No comments:

Post a Comment