* “దేవుని ప్రణాళిక” కధ *
వీధులు ఊడ్చేవాడికి పని చేసి చేసి విసుగొచ్చింది.
దేవుడితో మొరపెట్టుకున్నాడు.
రోజూ హాయిగా పూజలందుకుంటూ ఉంటావు.
నా బతుకు చూడు.
ఎంత కష్టమో.
ఒక్క రోజు… ఒక్కటంటే ఒక్క రోజు నా పనిని నువ్వు చెయ్యి. నీ పనిని నేను చేస్తా,”
అని సవాలు విసిరాడు.
దేవుడు దయతో సరేనన్నాడు.
అయితే ఒక్క షరతు. నువ్వు ఎవరేమన్నా నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ స్పందించకూడదు,
నోరు మెదపకూడదు
అన్నాడు దేవుడు.
సరే అన్నాడు మనోడు.
మనోడు దేవుడి స్థానంలో కూర్చున్నాడు.
కాసేపటికి ఓ ధనిక భక్తుడు వచ్చాడు.
“దేవా … నా కొత్త బిజినెస్ మొదలుపెడుతున్నాను. ఇబ్బడి ముబ్బడిగా లాభాల వర్షం కురిపించు”
అంటూ ముందుకు వంగి దణ్ణం పెట్టాడు.
ముందు జేబులోని పర్సు కింద పడిపోయింది.
అతను చూడకుండా వెళ్లిపోయాడు.
మనోడు “ఒరేయ్… పర్సు వదిలేశావు చూసుకోరా…” అందామనుకున్నాడు.
కానీ దేవుడు చెప్పింది గుర్తుకు తెచ్చుకుని మౌనంగా ఉండిపోయాడు.
ఇంకాస్సేపటికి ఓ పేదవాడు వచ్చాడు.
“దేవా… నా దగ్గర ఒక్క రూపాయి మాత్రమే ఉంది. అదినీకు సమర్పించుకుంటున్నాను. దయచూడు తండ్రీ”
అంటూ మోకరిల్లాడు.
కళ్లు తెరిచేసరికి డబ్బులతో నిండిన పర్సు కనిపించింది.
“ఇలా దయ చూపించావా తండ్రీ”
అని ఆ పర్సును తీసుకుని వెళ్లిపోయాడు.
“ఒరేయ్ దొంగా…. “
అని అరుద్దామనుకున్నాడు మనోడు.
కానీ దేవుడు చెప్పింది గుర్తుకొచ్చి ఎలాగోలా తమాయించుకున్నాడు.
ఆ తరువాత ఒక నావికుడు వచ్చాడు.
“దేవా రేపు సముద్ర ప్రయాణం ఉంది. నన్ను చల్లగా కాపాడు స్వామీ”
అన్నాడు.
అంతలోనే ధనిక భక్తుడు పోలీసులతో వచ్చాడు.
“నా తరువాత వచ్చింది ఇతడే. కాబట్టి ఇతడే నా పర్సును దొంగిలించి ఉంటాడు. పట్టుకొండి” అన్నాడు.
పోలీసులు అతడిని అరెస్టు చేశారు.
ఈ అన్యాయాన్ని చూసి మనోడు ఉండబట్టలేకపోయాడు.
“ఆగండ్రా… ఇతను నిర్దోషి. అసలు దొంగ ఇంకొకడు. వాడు పర్సును తీసుకెళ్లాడు.”
అని అరిచేశాడు.
దేవుడే చెబుతుంటే ఇంకా సాక్ష్యాలెందుకని నావికుడిని వదిలేసి, పేదోడిని పట్టుకుని వెళ్లిపోయారు పోలీసులు.
సాయంత్రానికి వీధులు ఉడ్చేవాడు దేవుడి డ్యూటీ నుంచి దిగేశాడు.
దేవుడు వీధులు ఉడ్చే డ్యూటీ నుంచి తన అసలు డ్యూటీకి వచ్చేశాడు.
“దేవా… ఇవాళ్ల ఎంత మంచి పని చేశానో తెలుసా…
నేను ఒక నిర్దోషిని అరెస్టు కాకుండా కాపాడాను.
ఒక దోషిని అరెస్టు చేయించాను.”
అన్నాడు మనోడు.
దేవుడు “ఎంతపని చేశావోయ్. నిన్ను అసలు స్పందించొద్దన్నానా… ఎందుకలా చేశావు.”
అన్నాడు నిష్ఠూరంగా.
“అదేమిటి? నువ్వు నన్ను మెచ్చుకుంటావనుకున్నాను.”
అన్నాడు వీధులు ఊడ్చేవాడు బాధగా….
“ధనవంతుడు మహాపాపాత్ముడు.
వాడు అందరినీ దోచుకుంటాడు.
వాడి డబ్బు కొంత పేదోడికి అందితే వాడికి కొంచమైనా పుణ్యం వస్తుందని నేనే ఇదంతా చేయించాను.
పేదోడికి కష్టాలు తీరేవి.
వాడు కొన్నాళ్లైనా ఆకలి దప్పులు లేకుండా ఉండేవారు.
ఇక నావికుడు తెల్లారితే సముద్రయానం చేయబోతున్నాడు.
దారిలో పెను తుఫాను వచ్చి వాడి పడవ మునిగి అందరూ చనిపోతారు.
వీడు అరెస్టై జైల్లో ఉంటే బతికిపోయేవాడు.
ఇప్పుడు చూడు… పేదోడు జైల్లో ఉన్నాడు. ధనికుడు పాపాలు చేస్తూనే ఉన్నాడు. నావికుడు చావబోతున్నాడు.
ఎంత పని చేశావు నువ్వు…
అన్నాడు దేవుడు.
దేవుడి ప్రణాళిక ఏమిటో ఎవరికీ తెలియదు.
కష్టంలా కనిపించేది వాస్తవానికి మేలు చేయొచ్చు.
తప్పులా కనిపించేంది నిజానికి ఒప్పై ఉండచ్చు.
ఆయన ఆలోచనల లోతు, అవగాహన ఎత్తు అందుకోవడం ఎవరికీ సాధ్యం ?
No comments:
Post a Comment