మీ అమ్మ మారిపోయిందమ్మా!
(శ్రీమతి గన్నవరపు సరోజినీ సత్యనారాయణమూర్తిగారి స్మారక కథలపోటీలో మొదటి బహుమతి గెల్చుకున్న కథ )
మీ అమ్మ మారిపోయిందమ్మా!
“మీ అమ్మ మారిపోయిందమ్మా..”అన్న నాన్నగారి మాటే నా చెవుల్లో గింగుర్లెత్తుతోంది. ఈ మాట ఆయన నాలుగునెలలక్రితం ఫోన్ లో అన్నారు. “అమ్మ మారడమేంటి నాన్నా!” అనడిగితే “ఏమోనమ్మా! నాకలా అనిపిస్తోంది..” అని అక్కడితో ఆపేసారు. మళ్ళీ నెల్లాళ్ళ తర్వాత అదే మాట. “ఏం జరిగింది నాన్నా!” అంటే “ఇదివరకులా లేదమ్మా.. ఇదివరకు అస్సలు యిల్లు కదిలేది కాదా! ఇప్పుడు అస్తమానం ఎక్కడికో అక్కడకి వెడుతోంది.” అన్న నాన్నగారి మాటలకి హోస్.. అంతేనా అనిపించింది. “పోనీ, వెళ్ళనీ నాన్నా.. ఇప్పటికి కదా అమ్మకి కాస్త వెసులుబాటయిందీ..ఇన్నాళ్ళూ యిల్లు పట్టుకునే వుంది కదా..!” అని తేలిగ్గా తేల్చేసాను. అప్పటికి వూరుకున్నారు నాన్న. మొన్న మళ్ళీ ఫోన్ చేసినప్పుడు “ఏవిటోనమ్మా! మీ అమ్మ యిదివరకులా లేదు. ఎప్పుడూ లేనిది డబ్బు లెక్కలు కూడా అడుగుతోంది.” అన్నారు. ఈ మాటకి కాస్త ఆశ్చర్యం వేసింది నాకు. ఎందుకంటే అమ్మ డబ్బు విషయం యెప్పుడూ పట్టించుకునేది కాదు. ఆ విషయాలన్నీ నాన్నగారే చూసుకునేవారు. అమ్మకి యెంతసేపూ యిల్లే కైలాసం, పతియే ప్రత్యక్ష్యదైవం అనే ధోరణిలో వుండేది. నాన్నగారికి యిబ్బందవుతుందని యేవైనా పెళ్ళిళ్ళుంటే తప్పితే పుట్టింటికి కూడా యెక్కువ వెళ్ళేది కాదు. అలాంటి అమ్మ డబ్బులెక్కలు అడుగుతోందంటే కాస్త వింతగానే అనిపించింది.
ఈ సంగతేమిటో తెలియాలంటే ఒకసారి రాజమండ్రీ వెళ్ళాల్సిందే అనుకున్నాను. అమ్మానాన్నల్ని చూసి వచ్చి కూడా అప్పుడే ఆర్నెల్లయిందని గుర్తు చేసుకుంటూ పనికట్టుకుని హైద్రాబాదునుంచి రాజమండ్రీ వచ్చాను. రైలు దిగి ఇంటికి వెడుతున్నంతసేపూ దారి పొడుగునా కనిపిస్తున్న చిన్నప్పటి జ్ఞాపకాలను మించిపోయాయి మా నాన్నగారు అమ్మని గురించి ఫోన్‍లో చెప్పిన మాటలు.
గేట్లోకి అడుగు పెట్టగానే ఇంటిముందు చుక్కలతో పెట్టిన మెలికలముగ్గు ముద్దుగా స్వాగతం చెప్పింది. అటువంటి మెలికలముగ్గు ఎన్నిసార్లో అమ్మ దగ్గర నేర్చుకుందామని ప్రయత్నించి విఫలురాలినయ్యాను. ముచ్చటగా ముగ్గును చూస్తూ ఇంటి వరండాలో అడుగు పెట్టిన నాకు నాన్నగారికి కాఫీ అందిస్తున్న అమ్మ కనిపించింది. నన్ను చూడగానే ఇంతమొహం చేసుకుని, “రా రా..ఒక్కదానివే వచ్చావా? పిల్లలు రాలేదా?” అంటూ అక్కున జేర్చుకుంది. అదేమిటో అమ్మ దగ్గరికి రాగానే చిన్నపిల్లనయిపోయినట్టనిపిస్తుంది. “నీ కాఫీకోసం వచ్చానమ్మా..” అన్నాను నవ్వుతూ. “రా అమ్మా.. రా..” అన్న నాన్నగారి పిలుపు విని అటు నడిచాను. పక్క కుర్చీ చూపిస్తూ, “పిల్లలూ, అతనూ బాగున్నారామ్మా?” అనడిగారు. మేమిద్దరం క్షేమసమాచారాలు చెప్పుకుంటూనే వున్నాం అమ్మ కమ్మటి కాఫీ అందించింది చేతికి.
అదేమిటో పుట్టింటికి వెళ్ళగానే యెక్కడలేని బధ్ధకం వచ్చేస్తుందేమో టైమ్ యెనిమిదవుతున్నా నాన్నగారూ, నేనూ అలా కబుర్లు చెప్పుకుంటూ అక్కడే కూర్చున్నాం. ఇంతలో అక్కడికి అమ్మ వచ్చింది. చూసి ఆశ్చర్యపోయాను. ఎప్పుడు స్నానం, పూజా చేసుకుందో, యెప్పుడు వంట చేసిందో, యెప్పుడు తయారయిందో తెలీదు కానీ శుభ్రమైన ఇస్త్రీచీర కట్టుకుని, చేతిలో ఒక చిన్న సంచీలాంటిది పట్టుకుని చెప్పులు వేసుకుంటూ మాతో అంది. “వంటంతా చేసి టేబుల్‍మీద పెట్టేనమ్మా. నువ్వూ, మీ నాన్నగారూ కబుర్లయాక స్నానం చేసి, భోంచెయ్యండి. నాకు చిన్న పనుంది. వెళ్ళొస్తాను..” అంటూ జవాబు కోసమైనా చూడకుండా వెళ్ళిపోయింది.
నాన్నగారి మొహం చిన్నబోయినట్తైపోయింది. “చూసేవామ్మా.. ఇదిగో, ఇదీ వరస. రోజూ యెక్కడికోక్కడికి వెడుతుంది. మళ్ళీ మూడుగంటలు దాటితేకానీ రాదు. అంత మొగుడికి అన్నంకూడా పెట్టకుండా చేసే రాచకార్యాలేంటో మరి?” కాస్త బాధగానూ, మరికాస్త నిష్ఠూరంగానూ అన్న నాన్నగారి మాటలకి ఓదార్పుగా అన్నట్టు ఆయన చేతిమీద చెయ్యివేసి, “నేను కనుక్కుంటానుగా నాన్నా..” అన్నాను. “అదేనమ్మా. అందుకే నీకు ఫోన్ చేసేను..” అన్నారాయన.
నేనక్కడున్న నాలుగురోజులూ అమ్మని బాగా గమనించాను. నిజమే. అమ్మ యిదివరకులా లేదు. యేదో తేడా కనిపించింది. తేడా అంటే ఆరోగ్యం విషయం కాదు. అలాంటి సమస్యలేవీ వున్నట్లు లేవు. కానీ యిదివరకులా ప్రతి చిన్న విషయం నాన్నని అడగడం, యెక్కడికైనా వెళ్ళాలంటే నాన్నగారి భోజన సమయాలూ అవీ కాకుండా చూసుకోవడం లాంటివేమీ లేవు. ఆఖరికి నాన్నగారిని మంచినీళ్ళు కూడా ముంచుకోనివ్వని అమ్మ గబగబా యేదో వండి అక్కడ పడేసి బైటకి వెళ్ళిపోవడం నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అదేమిటో అమ్మని అడగాలని ఈ నాలుగురోజుల్లోనూ ప్రయత్నించాను కానీ అడగలేకపోయాను. యేమని అడగగలను? సంసారం యెంత గుట్టుగా నడుపుకోవాలో నాకు చెప్పిన అమ్మని, భర్త మర్యాద నలుగురిలో యెలా కాపాడాలో పాఠాలు చెప్పిన అమ్మని, పిల్లలని యెంత బాధ్యతగా పెంచాలో ఉదాహరణలతో సహా చెప్పిన అమ్మని “నాన్నని ఒక్కరినీ అలా వదిలేసి బైటకి యెందుకు వెడుతున్నావమ్మా..”అని యేమని అడగగలను? అడగాలనుకున్నది అడగకుండానే హైద్రాబాదు తిరుగుప్రయాణం అవ్వాల్సొచ్చింది.
ఆటోలో స్టేషన్‍కి వెడుతున్న నేను టక్కున తలకి తగిలిన దెబ్బకి అమ్మానాన్నల గురించి ఆలోచనల్లోంచి ఒక్కసారి ఈ లోకంలో కొచ్చాను. ఆటో సడన్‍బ్రేక్ వెయ్యడంతో తల ఆటో ముందురాడ్‍కి కొట్టుకుంది. “అమ్మా..” అంటూ నుదురు తడుముకున్నాను. ఆటోవాలా రాంగ్‍రూట్‍లో వచ్చిన స్కూటర్‍వాడిని తిట్టుకుంటూ మళ్ళీ ఆటో స్టార్ట్ చేసాడు. ఇంకా స్టేషన్ ఎంతదూరమా అనుకునేలోపే స్టేషన్‍లో ఆపేడు ఆటోని. బాగ్ చేతిలోకి తీసుకుని, ఆటోకి డబ్బిచ్చి ప్లాట్‍ఫామ్ మీదకి వచ్చేటప్పటికి గౌతమి అప్పటికే ఆగి వుంది. పరుగెడుతున్నట్టే ఎస్8 బోగీ వెతుక్కుంటూ వెళ్ళి, బోగీకి అతికించిన ఛార్ట్ లో నా పేరు, బెర్త్‍నంబరూ చూసుకుని, లోపలకెళ్ళి బెర్త్ మీద బేగ్ పెట్టి కూర్చుని, “హమ్మయ్య..” అనుకున్నాను. కిటికీకి ఆనుకుని కూర్చున్న నాకు మళ్ళీ అమ్మానాన్నల గురించిన ఆలోచనలు మొదలయ్యాయి.
నాన్నగారన్న మాట నిజమే. అమ్మ యిదివరకులేని పనులు చాలా కల్పించుకుంది. వారంలో రెండురోజులు నాలుగు వీధులవతలవున్న స్కూల్‍కి వెళ్ళి, అందులో పిల్లలకి కథలు చదివి విన్పించి వస్తుంది. మరో రెండ్రోజులు కాస్త దూరంలో వున్న అదేదో సంఘానికి వెళ్ళి, అక్కడ మిగిలినవారితో కలిసి కౌన్సిలింగ్‍లాంటిదేదో చేస్తుంది. ఇంకో రెండ్రోజులు పక్క వీధిలో వున్న గుడికి వెళ్ళి పూలమాలలూ అవీ కట్టిచ్చి వస్తూంటుంది. యిలాగ యేదో పని కల్పించుకుని వూరు పట్టుకు తిరుగుతోందని నాన్నగారి అభియోగం. అన్నీ వండి పెట్టే వెడుతున్నాను కదా అని అమ్మ అంటుంది. “వండి పడేస్తే చాలా..నేనొక్కణ్ణి యెలా వుండగలననుకున్నావ్?” అని నాన్నగారి ప్రశ్న. “కాసేపే కదా వెడుతున్నాను. మీరు కూడా మీ కాలక్షేపమేదో చూసుకోండి..” అని అమ్మ జవాబు. నాకైతే అంతా అయోమయంగా అనిపించింది. యిన్నాళ్ళు లేని వ్యాపకాలు అరవయ్యేళ్ళు వచ్చేక యిప్పుడు అమ్మ యెందుకు కల్పించుకున్నట్టు? హాయిగా యిద్దరూ వేళకింత వండుకుని, తిని, ఒకరికొకరుగా వుండక లేనిపోని గొడవలు కోరి తెచ్చుకోవడమెందుకు? ఈ నాలుగురోజుల్లోను ఈ మాట అమ్మని అడుగుదామని చాలా ప్రయత్నించాను కానీ అడగలేకపోయాను.
నా ఆలోచనల్లో వుండిపోయి ట్రైన్ యెప్పుడు బయల్దేరిందో కూడా గమనించనేలేదు. టీసీ వచ్చి టికెట్ అడిగేటప్పటికి మళ్ళీ ఈ లోకంలో కొచ్చాను. టీసీకి టికెట్ చూపించి మళ్ళీ దానిని బేగ్‍లో పెట్టుకుంటుంటే అందులో యేవో కాగితాల మడతల్లాంటివి కనిపించాయి. ఇవేం కాగితాలు..నేనేం పెట్టలేదే అనుకుంటూ మడతలు విప్పగానే మొదటి పదమే “అమ్మలూ..” అంటూ అమ్మ చేతివ్రాత. ఒక్కసారి ఒళ్ళు జల్లుమంది. అమ్మ ఉత్తరం అది. అమ్మ ఉత్తరం రాసి నా బేగ్‍లో పెట్టింది. అంత ఉత్తరం రాసి చెప్పవలసిన విషయాలు యేమున్నాయా అన్న ఆతృతతో నా కళ్ళు ఆ అక్షరాల వెంట పరుగెత్తాయి.
“అమ్మలూ, పిల్లల పరీక్షల ముందు నువ్వు అమ్మనీ నాన్ననీ చూడడానికి యింత ఆతృతగా యెందుకొచ్చావో అర్ధం చేసుకోగలనమ్మా.. నా బంగారుతల్లీ, మామీద నీకున్న అభిమానానికి యెంత సంతోషంగా వుందో చెప్పలేను. నువ్వు నన్ను అడగాలనుకున్న ప్రశ్నలు నీ గొంతులోనే ఆగిపోయాయని తెలుసుకోలేనిదాన్ని కాదు. ఈ వయసులో నాన్నగారిని దగ్గరుండి చూసుకోకుండా నేను చేసే ఘనకార్యాలు నీకు మింగుడు పడలేదు కదూ! అవునమ్మా.. నిజమే.. మీ నాన్నగారికి డెభ్భైయేళ్ళు. నాకు అరవైయేళ్ళు దాటాయి. ఇదివరకంతా నాన్నని నీడలాగా కనిపెట్టుకుని వున్న అమ్మ ఈ పెద్ద వయసులో ఆయనని ఒక్కరినీ వదిలేసి బైట చేస్తున్న రాచకార్యాలకి కారణమేమిటో తెలుసుకోవాలని వుంది కదా తల్లీ. చెపుతాను విను.
అమ్మలూ, నీకూ తెలుసు.. నిన్నూ, చెల్లెల్నీ యెలా కళ్ళల్లో పెట్టుకుని పెంచానో. మీరు కాలేజీ చదువులు చదువుతున్నప్పుడు కూడా మీ చేత యింట్లో యే ఒక్క పనీ చేయించలేదు సరి కదా.. మీ యిద్దరికీ అన్నం కూడా కలిపి నోట్లో పెట్టేదాన్ని. అలాగ మీకు ఒక్కపనీ నేర్పకుండానే, అందరూ అమ్మలాగే వుంటారని చెపుతూనే మీకు పెళ్ళిళ్ళు చేసి పంపించాను. అలాగ పువ్వుల్లాగ పెరిగిన మీరిద్దరూ పూల కన్న ముళ్ళే యెక్కువగా వున్న ఈ సమాజంలో మీ సౌరభాన్ని నిలబెట్టుకుందుకు మీరు పడ్డ కష్టం మీకు తెలియనిది కాదు. ఆ భగవంతుని దయవల్ల యిద్దరూ మీమీ కుటుంబాల్లో యిమిడిపోయి మంచిపేరు తెచ్చుకున్నారు. మీరిద్దరూ అన్నీ మీ మీ అనుభవాలమీదే నేర్చుకున్నారు. ఒక ఐదారు సంవత్సరాలు మీరు శ్రమ పడినా మిగిలిన జీవితమంతా మీరు మీకు అనుకూలంగా మలుచుకున్నారు. కానీ ఒకరిమీద ఒకరం పూర్తిగా ఆధారపడ్డ నాకూ, మీనాన్నగారికీ మా రాబోయే జీవితం గడపడానికి అలాగ అనుభవం మీద నేర్చుకునే టైమ్ యిప్పుడు లేదమ్మా. ఇద్దరం జీవితం చరమాంకానికి వచ్చేసాం.
అమ్మలూ, నీకు తెలుసు కదా! యింట్లో మీ యిద్దరితో సమానంగా నాన్నగారిని చూసుకునేదాన్ని. పొద్దున్న లేచిందగ్గర్నుంచీ ఆయన తిండితిప్పలూ, అలవాట్లూ, చిరాకులూ అన్నింటినీ ఆయన కూడా ఒక పిల్లాడే అనుకుని నిభాయించుకుని వచ్చేదాన్ని. మీలాగే ఆయనకూడా నామీద పూర్తిగా ఆధారపడిపోయారు. మీరు బైటకి వెళ్ళి నాలుగూ నేర్చుకున్నారేమో కానీ, నాన్నగారు మటుకు మీరు పెళ్ళిళ్ళు చేసుకుని వెళ్ళాక నా మీద ఆధారపడడం మరీ యెక్కువైపోయింది. నాకూ అది ఆనందంగానే అనిపించేది. యెందుకంటే మీ నాన్నగారంటే నాకున్న యిష్టం వల్ల. కానీ, తల్లీ.. ఆరునెల్లక్రితం జరిగిన ఒక సంఘటన నాలో యిదివరకు లేని ఆలోచనను తట్టిలేపింది.
నీకు మన దయానందం తెల్సుకదా.. ఆయన భార్య హఠాత్తుగా పోయింది. పాపం దయానందం. భార్య వున్నన్నాళ్ళు మంచినీళ్ళు కూడా ముంచుకుని యెరగడు. పిల్లలు యెవరి సంసారాలు వాళ్లవి. వాళ్ల దగ్గరికి వచ్చి వుండమన్నా కూడా యిల్లూ, పెన్షనూ వచ్చినన్నాళ్ళు యెవరి దగ్గరికీ వెళ్లలేరు కదా! అలాగ ఒక్కడే వుంటున్నాడు. వంట మాట అలా వుంచు..ఉదయం లేచి కాఫీ పెట్టుకోడం కూడా రాదు. ఎవరిని యేమడగాలో తెలీదు. అది చూసి నాకు ఒక్కసారి భయంలాంటిది వేసింది. అనుకోడానికి యిష్టమున్నా లేకపోయినా పునర్జన్మ సిధ్ధాంతం నమ్మినవాళ్లం మనం. ఆ భగవంతుడి పిలుపు యెప్పుడోప్పుడు రాకతప్పదు. అందరం యెప్పుడో అప్పుడు పైకి వెళ్ళవలసినవారమే! యెవరు ముందో యెవరు వెనకో యెవరికి తెలుసు? ఒకవేళ నేను ముందు వెళ్ళిపోతే మీ నాన్నగారికి కంచంలో అన్నం యెవరు వడ్డిస్తారు? టేబిలు మీదున్న గిన్నెల్లో ముందుది వేసుకుని, వెనకది చూసుకోని మీ నాన్నగారి పరిస్థితి యేమిటి? ఆయనకి మంచినీళ్ళు యెవరు అందిస్తారు? మేం లేమా అంటారు మీరిద్దరూ. కానీ, ఆయనింట్లో ఆయనుంటే వున్న గౌరవం మీ యిళ్ళకొచ్చి వుంటే వుండదు కదా! అయినా చిన్నప్పట్నుంచీ యెవరింటికీ వెళ్ళని మనిషి కూతురింట్లో యెలా వుంటారు? మీరు మీ సంసారాలని వదిలి ఆయన దగ్గరకొచ్చి వుండలేరు కదా! యెల్లకాలమూ నేను ఆయన పక్కన వుండలేనని నాన్నగారికి తెలియాలి. చిన్న చిన్న పనులైనా ఆయనంతట ఆయన చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. నేను యింట్లో వున్నంతసేపూ మీ నాన్నగారు అలా చెయ్యరు. అందుకనే నేను బైటకి వెళ్ళడం అలవాటు చేసుకున్నాను. కావాలని వ్యాపకాలు పెంచుకున్నాను. ఆయన ఆకలి ఆయనకి తెలియాలనీ, ఎక్కడెక్కడేమున్నాయో చూసుకుని కావలసినవి తీసుకుని తినడం తెలుసుకోవాలనీ అనుకున్నాను. నేను బైటకి వెడితే మధ్యాహ్నం టీ పెట్టుకోవడం యెలాగో చెప్పాను. యివన్నీ చెపుతున్నప్పుడు నాలో నేను యెంత మథనపడ్డానో తెలుసా తల్లీ.. కానీ అంతకన్న దారిలేదు. వంటమనిషిని పెట్టి వండించుకున్నా, లేకపోతే బైటనుంచి భోజనం తెప్పించుకున్నా రేపు నేను వెళ్ళిపోయాక కనీసం టేబిలు మీదున్నవయినా వడ్డించుకు తినే అవకాశముంది. మొన్నమొన్నటివరకూ మీ నాన్నగారు పూర్తిగా నామీద ఆధారపడేవారు. నాకు అదెంత సంతోషంగా అనిపించేదో! కానీ, దయానందాన్నిచూసాక ఒకవేళ నేను ముందు వెళ్ళిపోతే మీ నాన్నగారి పరిస్థితి యెలా వుంటుందోనని భయపడి యిలా చెయ్యవలసివచ్చింది. ఒక్క విషయం చెప్పనా తల్లీ..మనం ఆడవాళ్ళం.. ప్రతి ప్రసవానికీ మరణం అంచులదాకా వెళ్ళొస్తాం కనుక మన గుండె కొంచెం గట్టిగా వుంటుంది. కానీ, మగవాళ్ళు యెంత పెద్దవాళ్ళైనా పసిపిల్లలేనమ్మా.. వాళ్ళని యెప్పుడూ అమ్మో, భార్యో, కూతురో చూస్తూండాలి.
అమ్మలూ, యిదంతా చదువుతుంటే నీకు యింకో ప్రశ్న రావచ్చు. తప్పులేదు.. యెవరు ముందో యెవరు వెనకో యెవరు చెప్పగలరు? ఒకవేళ నేనే ఒంటరిదాన్నయిపోతేనో.. అవును.. ఆడవాళ్ళు వొంటరిగా మిగిలిపోతే వారి బాధ వేరుగా వుంటుంది. అందుకే యెప్పుడూ పట్టించుకోని నేను మీ నాన్నగారిని డబ్బు విషయాలు అడగడం మొదలుపెట్టాను. మన శాంతి తెలుసు కదా.. వాళ్ళమ్మ..పాపం యిలాగే ఒంటరి దయిపోయింది. వాళ్లాయనకి యే బేంక్‍లో యెంత డబ్బుందో ఆవిడకి అస్సలు తెలీదు. పక్కన వున్న ఆవిడకే తెలీకపోతే యెక్కడో ఉద్యోగాల్లో వున్న పిల్లలకి మాత్రం యెలా తెలుస్తుంది? అందుకే మీ నాన్నగారిని ఏ బాంక్‍లో ఎంత డబ్బుందో చెప్పమన్నాను. అలా అడిగానని ఆయనకి కోపం కూడా వచ్చింది. కానీ నా భయం నన్నలా అడిగించింది తల్లీ.
యిన్ని విషయాలు తెలిసున్నదానివి ఈ నాలుగురోజులూ నాన్నగారితోనే గడపకుండా ఆయన్ని ఒంటరిగా వదిలి బైటకి యెందుకు వెడుతున్నాననుకుంటున్నావేమో.. చెపుతాను విను.. అమ్మలూ, నాకు పెళ్ళయి వచ్చినప్పటినుంచీ మీ నాన్న చుట్టూ తీగలా అల్లుకుపోయాను. ఆయనలేని జీవితాన్ని ఊహించలేని స్థితికి వచ్చేసాను. మీ నాన్న తప్పితే అంత ఆసరా మరింక యెవ్వరూ యివ్వలేరు. అందుకే ఆయన చుట్టూనే ముడులూ, బ్రహ్మముడులూ వేసేసుకున్నాను. కానీ, ఒక్కసారి శాంతివాళ్ళమ్మ పరిస్థితి చూసేసరికి నన్ను వెన్ను మీద యెవరో చరిచినట్లయింది. యిప్పటినుంచీ ఆ ముడులను విప్పుకుని, నా అంతట నేను నిలబడలేకపోతే మూలమే కదిలిపోయి నేలమీదపడి అందరి కాళ్ళకిందా నలిగిపోతాను. అందుకే నా మనసుని నేను గట్టి చేసుకున్నాను. కనీసం పగలు రెండుగంటలైనా మీ నాన్నగారు ఒంటరిగా వుండేలా చెయ్యాలనుకున్న నేను, నాకు కూడా ఈ యిల్లు కాక మరో ఆసరా కావాలనిపించింది.
తల్లీ, ఒక్క మాట చెప్పనా.. మనిషి బ్రతికున్నన్నాళ్ళు తిండీ, బట్టా కనీసావసరాలు. మన ఆకలికి తిండి తినడం తప్పనిసరి యెల్లాగో అలాగే ఎదుటి మనిషికోసం బట్ట కట్టుకోవాలి. లేకపోతే మనలను పిచ్చివాళ్ళకింద జమకడతారు. కానీ, ఈ రెండింటితోపాటు మనసన్నది కూడా ఒకటుంటుంది కదమ్మా. దానికి సరైన ఆలోచన లేకపోతే అది దెయ్యమై పీక్కు తింటుంది. అందుకని నా మనసుకి తృప్తి కలిగించుకుందుకు నేను ఆ వ్యాపకాలు పెట్టుకున్నాను.
ఇంకోవిషయం చెప్పనా తల్లీ.. బాల్యం మనకి తెలీకుండానే ఆనందంగా గడిచిపోతుంది. యవ్వనం మనం కావాలని ఆనందిస్తూ గడుపుతాం. మధ్యవయసు సంతోషంగా చేసే బాధ్యతల బరువుతో నడుస్తుంది. యివన్నీ ఆనందంగా స్వీకరిస్తున్న మనం వానప్రస్థాన్ని మటుకు అంతే ఆనందంగా యెందుకు స్వీకరించకూడదు? వార్ధక్యం అంటే భయమెందుకు? అన్నింటికీ ఆ భగవంతుడే వున్నాడనుకుంటూ తామరాకుమీది నీటిబొట్టులా గడపడానికి యెందుకు ప్రయత్నించకూడదూ అన్నదే నా ప్రశ్న. నేను అందుకే డిటాచెడ్ గా వుండడానికి ప్రయత్నిస్తున్నాను. ఇలా చెయ్యడం నాకూ చాలా కష్టంగానేవుంది కానీ తప్పదుగా మరీ!..
తల్లీ, పండితులొకరు వానప్రస్థమంటే యేమిటో విడమరిచి చెప్పారు. మనని మనం ఈ సంసారబంధాలకు గట్టిగా కట్టేసుకున్నాం. వానప్రస్థమంటే ఆ బంధాలను వదులుకోవడం కాదుట. గట్టిగా కట్టుకున్నబంధాలు కాస్త వదులవడానికి ఆ కట్టుపైన మరోకట్టు యింకా గట్టిగా కట్టడంట. అప్పుడు ముందు కట్టినకట్టు కాస్త వదులవుతుందన్నమాట. అంటే సంసార బంధాలను కాస్త తగ్గించుకుని, ఆధ్యాత్మికతవైపుకానీ, సామాజిక సమస్యలవైపు కానీ మరో బంధం యేర్పరచుకోవడం. అందుకే నేను నాకున్న పరిథిలో కొన్ని వ్యాపకాలను యేర్పరచుకున్నాను.
తల్లీ, నువ్వు నన్ను అడగబోయి మానుకున్న ప్రశ్నలకి సమాధానాలు దొరికేయనుకుంటాను. యిప్పుడిదంతా యింత వివరంగా యెందుకు రాస్తున్నాననుకుంటున్నావేమో..దానికి ముఖ్యకారణం ఒకటుంది. నేను మీ అక్కచెల్లెళ్ళిద్దరినీ ఒక్క కోరిక కోరుకుంటున్నాను. ఆ భగవంతుడు నన్నొక్కదాన్నీ వుంచితే మీరు ఫోన్ చెయ్యడం కాస్త ఆలస్యమైనా మీ సంసారబాధ్యతలు తెలిసినదాన్ని కనుక అర్ధం చేసుకోగలను. కాని అలా కాకుండా నాకే ఆయన పిలుపు ముందుగా వస్తే కనక మీ నాన్నని వారం, పదిరోజుల కొక్కసారైనా ఫోన్‍లో కాస్త పలకరిస్తూండండి. మీ దగ్గరనుంచి ఫోన్ రావడం నాలుగురోజులు దాటిన దగ్గర్నుంచీ మీరెలా వున్నారోనని ఆయనలో ఆతృత మొదలౌతుంది. అది రోజురోజుకీ పెరిగి మరో నాలుగురోజులయ్యేటప్పటికి యింక అదే ధ్యాసలో పడిపోయి, మీ గురించి లేనిపోనివి ఊహించేసుకుని బెంగ పెట్టేసుకుంటారు. అందుకని నువ్వూ, చెల్లీ కూడా మీ నాన్నకి వారానికోసారి ఫోన్ చేస్తామని ఈ అమ్మకి మాటిస్తారు కదూ...
…. మారిపోయిన మీ అమ్మ..
చేతులమధ్య నలిగిపోతున్నకాగితం చివర వున్న “అమ్మ” అన్న మాటను చదవడానికి నాకు కళ్ళనిండుగా వున్న నీళ్ళు అడ్డం వచ్చేయి.
JANUARY 18, 2017 సారంగ-సాహిత్యవారపత్రికవారి సౌజన్యంతో..
No comments:
Post a Comment