Pages

Saturday, February 11, 2017

శని గురించి అందరూ భయపడతారు కానీ ఐశ్వర్యాన్నీ, యోగాన్ని కలిగిస్తాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు

శని గురించి అందరూ భయపడతారు కానీ ఐశ్వర్యాన్నీ, యోగాన్ని కలిగిస్తాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
మనం సాధారణంగా నవగ్రహాలలో శనీశ్వరుడు అంటే చాలా భయపడుతూ ఉంటాము. శనీశ్వరుడి యొక్క పేరు వినగానే ఒకరకమైనటువంటి ఆందోళనకి గురైపోతూవుంటాం.

మన జాతకంలో శని పీడ మనకు రాకూడదని శని తన ప్రభావాన్ని మనమీద చూపించకూడదు అని కోరుకుంటాం.

ఏలినాటి శని, అష్టమ శని , అర్ధాష్టమ శని ఈ పేర్లు వింటేనే వణికిపోతాం. కానీ శనీశ్వరుడు ఇచ్చేటటువంటి విశేషాన్ని కనక మనం తెలుసుకుంటే అస్సలు వీటి గురించి భయపడం. శనీశ్వరుడ్ని ఆరాధిస్తాం, శనీశ్వరుడిని అభిమానిస్తాం, శనీశ్వరుడ్ని పూజిస్తాం.

” నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి సెనేశ్చరం “ అంటారు. నీలాంజనం – అంటే నల్లటి కాటుక రూపంలో ఉండేటటువంటి వాడు, రవిపుత్రం – సూర్యభగవానుడి యొక్క పుత్రుడు, యమాగ్రజం-యముడికి సోదరుడు, ఛాయా మార్తాండ సంభూతం – ఛాయా దేవికి మార్తాండుడికి అంటే సూర్య భగవానుడికి జన్మించినటువంటి వాడైనటువంటి, తం నమామి సెనేశ్చరం-అటువంటి శనీశ్వరుడికి నమస్కరిస్తున్నాను అని కనక మీరు ఒక్కసారి స్మరించారంటే శనీశ్వరుడు మిమల్ని అనుగ్రహిస్తాడు.

శనీశ్వరుడిని మనం ఎప్పుడు కూడా శని శని శని అని పిలవకూడదు. శనీశ్వరుడు అని మాత్రమే అనాలి. ఒక విశేషం గమనించండి. ఈశ్వర శబ్దం ఎక్కడైతే ఉందో అక్కడ ఐశ్వర్యం ఉంటుంది, భోళా తత్వం ఉంటుంది. ఉదాహరణకి శివుడ్ని ఈశ్వరుడు, మహేశ్వరుడు అంటాం ఆయన అలా అనుగ్రహిస్తాడు అదేవిధంగా వెంకటేశ్వర స్వామి వారి యొక్కపేరులో కూడా వెంకట ఈశ్వరుడు అని ఉంది. ఈశ్వర శబ్దం ఉంది అందుగురించే ఆయన కలియుగ దైవంగా మారిపోయి మన యొక్క కోరికలన్నింటినీ కూడా నెరవేరుస్తూ ఉన్నాడు. అదేవిధంగా శని యొక్క నామధేయంలో శనీశ్వరుడు శని ఈశ్వరుడు అనేటటువంటి శబ్దం రావడం చేత ఈ శనీశ్వరుడు కూడా శివుడిలాగా, వేంకటేశ్వరుడిలాగా మనల్ని అనుగ్రహిస్తాడు అని శాస్త్రాలు ఖచ్చితంగా చెబుతున్నాయి.

శనీశ్వరుడికి అస్సలు మీరు బయపడాల్సినటువంటి పనిలేదు. నవగ్రహాలకి వెళ్ళినప్పుడు శనీశ్వరుడికి భక్తిగా నమస్కారం చేసుకోండి. ఆయనకీ నమస్కారం చేసుకోవడం వల్ల శనివార నియమాల్ని పాఠించడం వల్ల నీలం రంగుగాని, నలుపు రంగుగాని వస్త్రాల్ని ఎక్కువగా ధరించడం వల్ల శనీశ్వరుడుకి ఇష్టమైనటువంటి పనులు చిమ్మిలి నివేదనం చేయడం వల్ల శివారాధన చేయటం వల్ల, శనీశ్వరుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. ఆయన వల్ల కలిగేటటువంటి దోషాలేవైతే ఉన్నాయో అంటే గ్రహరీత్యా ఏ గ్రహమైనాసరే మీకు యోగాన్ని కలిగిస్తుంది అదేవిధంగా పీడని కలిగిస్తుంది. శనీశ్వరుడు కూడా అంతే ఆయన ఉన్నటువంటి స్థానాన్ని బట్టి జన్మ శని, ద్వాదశ శని, లేకపోతే ద్వితీయ శని వీటిని బట్టి ఆయన ఉండేటటువంటి స్థానాన్ని బట్టి ఆయన మిమల్ని కొద్దిగా కష్ట పరుస్తాడు.

ఎవరైతే ఆయన్ని భక్తిగా పూజిస్తారో ఆయన్ని గౌరవిస్తారో వాళ్ళని ఆయన ఏమీ చెయ్యడు అనుగ్రహిస్తాడు. కానీ మనం ఎప్పుడు కూడా శనిపీడా రావాలనే కోరుకోవాలి ఎందుకంటే శనీశ్వరుడు మిమ్మల్ని కొద్దిగా పీడించాడంటే దానికి వందరెట్లు యోగాన్ని, ఐశ్వర్యాన్నీ మీకు కలిగించి వెళ్తాడు. మాకు శనీశ్వరుడి పీడా వద్దండి అనుకున్నారనుకోండి ఆయన ఇచ్చేటటువంటి యోగము, ఐశ్వర్యం కూడా మీకు రాదు. అందుకని శనీశ్వరుడు పీడించాలి దానికి వందరెట్లు యోగాన్ని, ఐశ్వర్యాన్నీమనకి కలిగించాలని చక్కగా భక్తిశ్రద్ధలతో కోరుకోండి. శనీశ్వర ఆరాధన చేయండి. శనీశ్వరుడ్ని చక్కగా నీలరంగు పుష్పాలతో పూజించండి. శివారాధన చేయండి, హనుమంతారాధన చేయండి, అయ్యప్ప స్వామిని ఆరాధనా చేయండి. ఇలా చెయ్యడం వల్ల శనివార నియమాల్ని పాటించడం వల్ల చక్కగా శనీశ్వరుడు మిమ్మల్నిఅనుగ్రహిస్తాడు. కొద్దిగా ఇబ్బంది పెట్టినా అంతకు మించినటువంటి ఐశ్వర్యాన్నీ, యోగాన్నిమీకు కలిగిస్తాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇంత తెలిసిన తరువాత మీరు శనీశ్వరుడు అంటే ఎందుకు భయపడతారు. ఇక ఆ భయాన్ని వదిలిపెట్టేసెయ్యండి చక్కగా శివారాధన, శనీశ్వరాధన చేయండి. శనీశ్వరుడు మిమల్ని ఎలా అనుగ్రహించాలో అలా అనుగ్రహించేస్తాడు ఎటువంటి సందేహము లేదు.

No comments:

Post a Comment