Pages

Thursday, February 16, 2017

చట్నీ పొడి తయారు చేసుకునే విధానము

ఈ  రోజు  మీకు  చట్నీ పొడి  తయారు  చేసుకునే  విధానము  గురించి  తెలియ చేస్తాను.

ఈ  చట్నీపొడి  ఇడ్లీలలోకి , దోశెల లోకి  చాలా  బాగుంటుంది .

మా  చిన్నప్పుడు   అమ్మ  ఊరెళ్ళ వలసి  వస్తే  ఒక  సీసా నిండా  చట్నీ పొడి  కొట్టి  వెళ్ళేది.

మేమందరం  వేడి  వేడి  అన్నంలో  ఈ  చట్నీ పొడి  , నెయ్యి  వేసుకుని  తినే వాళ్ళం.

పిల్లలకు  అన్నం లోకి  ఆదరువుగా  బాగుంటుంది.

ఈ  చట్నీ  పొడికి  కావల్సిన వస్తువులు .

ఎండుమిరపకాయలు  -- 15
పుట్నాల పప్పు  ---  100 గ్రాములు
(  వేయించిన  శనగపప్పు  )
పచ్చి శనగపప్పు   - -  50  గ్రాములు.
చాయ మినపప్పు  --  మూడు స్పూన్లు.
జీలకర్ర   --  అర స్పూను .
ధనియాలు  --  స్పూను.
ఎండు కొబ్బరి  ---  అర చిప్ప
కరివేపాకు  ---   ఒక చిన్న కప్పుడు
చింతపండు   --  నిమ్మకాయంత
ఉప్పు  --  తగినంత
బెల్లం --  తరిగిన బెల్లం  ఒక  స్పూను.
పసుపు  --  పావు  స్పూను .
మెంతులు  --  పావు స్పూను.
నూనె  --  మూడు  స్పూన్లు .
ఇంగువ -  కొద్దిగా

చట్నీ  పొడి  తయారు  చేయు  విధానము.

ముందుగా  స్టౌ  మీద  బాండీ  పెట్టి
పచ్చి శనగపప్పు   కమ్మని  వాసన వచ్చే దాకా  నూనె  వేయకుండా  విడిగా  వేయించి  వేరే  ప్లేటు లోకి  తీసుకోవాలి .

ఆ  తర్వాత  పుట్నాల పప్పు కూడా
కొంచెం   వేయించి  విడిగా  ప్లేటులో
వేరే  పెట్టు కోవాలి నూనె లేకుండా.

ఎండుకొబ్బరి  కోరుకుని  విడిగా  వేయించుకోవాలి నూనె  లేకుండా.

ఉప్పు  , గింజలు    ఈనెలు  తీసిన   చింతపండు  కూడా  తడి  లేకుండా  వేయించుకోవాలి.నూనె  వేయకుండా.

ఇప్పుడు  స్టౌ  మీద  బాండీ  పెట్టి  మూడు  స్పూన్ల   నూనె  వేసి నూనె బాగా  కాగాక ముందుగా మెంతులు వేయాలి , ఆ తర్వాత చాయ మినపప్పు ,  ధనియాలు ,
జీలకర్ర  , కొద్దిగా  ఇంగువ, పసుపు కొద్దిగా వేసి , ఎండుమిరపకాయలు
కరివేపాకు  వేసి కమ్మని  వాసన వచ్చే దాక   వేయించు కోవాలి .

పోపు  ,  విడిగా   వేయించిన  పదార్ధములు  చల్లారాక  మిక్సీలో
ముందు
పచ్చి శనగపప్పు   వేసి మెత్తగా తిప్పాలి.

తర్వాత  అందులోనే  వేయించిన శనగపప్పు   వేసి  తిప్పాలి .

తర్వాత  వేయించుకున్న పోపంతా అందులో  వేసి  తిప్పాలి .

తర్వాత  ఎండుకొబ్బరి , చింతపండు , ఉప్పు  , తరిగి  ఉంచుకున్న బెల్లం కూడా  వేసి అన్నీ  మెత్తగా  మిక్సీ వేసుకోవాలి.

ఇప్పుడు  అన్నీ  ఒక  ప్లేట్లో లోకి  తీసుకొని  బాగా కలిపి  ఉప్పు  సరిపోయిందో  లేదో  చూసుకుని  ఒక  సీసాలో  పోసి   ఉంచుకుంటే
ఒక  నెల  రోజుల  పైనే  నిల్వ  ఉంటుంది .

బెల్లం  ఇష్టం  లేని  వారు  మానేయవచ్చు.
కాని 
కొంచెం  బెల్లం వేసుకుంటేనే  చట్నీ పొడికి  రుచి  వస్తుంది .

కారం  ఉండదు  కాబట్టి  పిల్లలు  చాలా  ఇష్టం గా  తింటారు.

No comments:

Post a Comment