Pages

Friday, February 10, 2017

యమధూత వర్తమానం..

యమధూత వర్తమానం..

శ్మశానానికి వెళ్ళి  కాలుతున్న శవాలను అడిగా.. ఎక్కడకి వెళుతున్నారు మీరు అని??
ఏమో తెలీదు అయినా నువ్వెవరు ప్రాణాలతో శ్మశానానికి ఎందుకొచ్చావ్ ,ఎలా వచ్చావ్,ఇంత అర్థరాత్రి,
అని అడిగింది కాలుతున్న ఓ శవం..
నేను కొన్ని రోజులనుండి  మానసిక సంఘర్షణకు లోనౌతున్నా మనం ఎవరం ,ఎందుకు పుడుతున్నాం ఎందుకు చచ్చిపోతున్నాం మనవెంట ఏం వస్తుంది?,... అని మాట పూర్తవకుండానే నా మాటకి అడ్డొచ్చింది
ఆ శవం, పిచ్చివాడా అవి అందరికీ వచ్చే,ప్రశ్నలే,ప్రతీ హృదయంలో  జరిగే సంఘర్షణే..ఆ మాటకొస్తే నామటుకునాకు చాలాసార్లు వచ్చింది.కాని ఎవరికైనా తెలిస్తే నవ్వుతారేమో అని ఎవరికి చెప్పకుండా ఇక్కడే ఉంటాం ఇదంతా మనదే అని,అణా కూడా దానం చేయకుండా, చాలా ధనం కూడబెట్టా,కొంత భూములు తవ్వికూడా దాచుకున్నా వాటిని తగ్గలెయ్యా నేను తగలబడిపోతున్నా రావట్లేదే???ఇందాకణ్ణించీ అదే ఆలోచిస్తున్నా..
సరే నువ్వేం చేసావో చెప్పు..
మళ్ళీ నేను చెప్పడం ఆరంభించా..
అలా మానసిక సంఘర్షణతో ఉండలేక అందర్ని అడగడం మొదలెట్టా ఎవ్వరూ చెప్పలేదు సరికదా కొంతమంది తిట్టారు,కొంతమంది కొట్టడానికొచ్చారు,కొంతమంది పిచ్చోడన్నారు..కొంతమందైతే సంపాదించడం చేతకాకే ఇలాంటివి ఆలోచిస్తున్నావ్ అన్నారు..
అంతే ఈ జనం,!!వాళ్ళు నడిచేదారికి వెంట్రుకవాసి పక్కకు జరిగినా ,వాళ్ళకు రాని ఆలోచన వచ్చిన తట్టుకోలేరు ఒక్కొక్కరుగా చెప్పిచూస్తారు లేకుంటే గుంపుగా వచ్చి మీదపడతారు,అరుస్తారు,బెదిరిస్తారు,అయినా వినకుంటే యుద్ధంమొదలెడతారు,మొత్తానికి వాళ్ళ దారిలోకి నిన్ను తెచ్చుకునే వరకూ నిద్రపోరు.
అంతే వాళ్ళంతే...

కానీ నేను సమాధానపడలేదు అన్వేషణ ఆపలేదు అలా నిర్విరామ అన్వేషణలో అలసి నీరసిల్లి ఓ చెట్టునీడన సొమ్మసిల్లి పడుకున్నా అంతే కలలో యమధూత వర్తమానం తెచ్చాడు నీ ప్రశ్నలకు సమాధానం దొరుకుంది అని..అంతే ఆ ఆనందకరకంగారులో మెలకువ వచ్చేసింది ఇలా వచ్చేసా..

శ్మశానానికి ఒక్కడివే ఇంత ధైర్యంగా అర్థరాత్రి వచ్చావంటేనే నాకు ఆశ్చర్యమేసింది!!చాలా వేదననుభవించుంటావ్ పాపం! అంది ఓ పుఱ్ఱె.
నేను ఆశ్చర్యంగా చూసా ఏంటి పుఱ్ఱొక్కటే ఉందేంటా అని,
క్షమించు నేనెవరో చెప్పలేదుకదా ,నా పేరు ఇపుడు చెపితే బాగుండదు కానీ ,బ్రతికున్నప్పుడు సుందరి ,చాలా అందంగత్తెనని అందరూ అనే వాళ్ళు,నేనూ అనుకునేదాన్ని కూడా,ఎంతో మంది పొగడేవారు కవితలు,పాటలు,వ్రాసేవారు నా కళ్ళమీద,జుత్తు మీద,ఒంపుసొంపుల మీద...
పొగడ్తలు కదా వాటి దుంపతెగ ఎలాంటి వారినైనా మత్తులో ముంచి దుఃఖంలో తేలుస్తాయ్!!
చాలా అహంకారంగా ఉండేదాన్ని,అంటే అందరికంటే నేను కొంచెం అధికురాలిని,తోటి వారిని చులకనగా చూడ్డం..అబ్బో చాలా చేసాలే ఇపుడు ఏడుద్దామంటే కళ్ళుకూడా లేవు!!
అందం శాశ్వతంగా అంటిపెట్టుకుని ఉంటుందని ,శరీరం ఇలా ఒంపులతో ఉంటుందని అనుకునే దాన్ని ,
కొంతకాలాలానికి....
నడుం ఒంగింది,జుత్తు తెల్లబడింది,చర్మం ముడతలు పడింది,అందగత్తె అని విన్న నాచెవుల్లో కొన్నాళ్ళకి, ముసల్ది ముసల్ది  అనీ,ఇపుడు దిగిందిరా దీని పొగరు  అనే మాటలు మార్మోగాయి .అదితట్టుకో లేక , ఆ బాధతో కుమిలి,కుమిలి మంచం పట్టా కొన్నాళ్ళకి ఇక్కడికొచ్చా ..
శునకాలు,గ్రద్దలు అన్ని ఎముకలు లాక్కుని,పీక్కుని పోగా ఇలా పుఱ్ఱెగా మిగిలా...
ఇపుడు తత్త్వం తెలిసింది ఏం లాభం చెప్పు ???
అని ఆవేదన పడింది..

నా హృదయాంతరాళంలో ఏవో పొరలు తెగసాగాయి.,

ఇంతలో ఓ బూడిదగుట్ట నాతో ఇలా అంది ,నువ్వు అదృష్టవంతునిలా ఉన్నావ్ ప్రాణం ఉండగానే మంచి ఆలోచనలొస్తున్నాయ్,సత్యాన్వేషణ మొదలైంది నీకు..
నాకు ఇలాంటివేమీ వచ్చేవి కావు. పేరు, గొప్ప వస్తే చాలు అందరూ నన్ను గుర్తిస్తే చాలు,అందరూ నన్ను గొప్పవాడు అంటే చాలు  అనుకునే వాణ్ణి!!
ఎక్కడైనా దానాలు చేస్తే అక్కడే గోడలమీద పెద్దపెద్ద అక్షరాలతో నాపేరు రాళ్ళమీద చెక్కించుకునే వాడిని.
కాలం మారింది ఆస్తులు కరిగాయి గొప్పవాడన్నవారే కళ్ళు నెత్తికెక్కి దానాలు చేసాడు ఎంత పొగరుగా ఉండే వాడు ఇపుడు అన్నీ చల్లారాయ్ పాపం..అని హేళన చేసేవారు..అంతే మానసికంగా కృంగిపోయి కొన్నాళ్ళకి ఇలా బూడిదగా మిగిలా ఇపుడు గాలెటువీస్తే అటు కదలడం తప్ప ఏం చేయలేను,

ఆ మాటలు విని నా కంట నీరు ఆగలేదు..
హృదయంలో మిగిలిన చీకటి పొరలేవో తెగిపోయినట్టు అనిపించింది..
నెమ్మదిగా సూర్యోదయమైంది...
వారందరికీ సాష్టాంగ నమస్కారం చేసి అక్కడనుండి కదలా,ఇపుడు ప్రతీ అడుగులో ఏదో క్రొత్తదనం ఉంది,
ఊపిరి తీసుకుంటుంటే ఆనందంగా ఉంది,
ఏవో కావాలి అని అనిపించట్లేదు,
ఆ ఆనంద పారవశ్యంలో, యమధూతకు హృదయంలోనే నమస్కారం తెలుపుతూ కదులుతున్నా ....
శవాన్ని మోసుకుంటూ ఓ గుంపు వస్తోంది..
నేనూ శవాన్ని మోస్తానని వారినికోరాను వారు అనుమతించారు..నేను సంతోషించా,ఎందుకో కళ్ళవెంట నీరు అలా వస్తూనే ఉంది వారితో మళ్ళీ శ్మశానం వరకూ వచ్చాను మధ్యలో  ఆ శవం మీద పుష్పం ఒకటి నా చెవులోకి వచ్చి ఇలా అన్నది..
"ఇపుడు అర్థమైందా ఏది మిగులుతుందో??
అన్నీ పోతాయ్ .పోనిది ఒక్కటే అది నీలోనూ ఉంది నాలోనూ ఉంది అంతటా ఉంది.."
అని అంటూ మళ్ళీ ఆ శవం చెవిదగ్గరకు వెళ్ళింది..
ఇపుడు నా కన్నీరు ఆగింది..
వర్ణించిచెప్పలేని ఆనందాన్ని నాలో గుర్తించా!!

ఈ విశ్వాన్నంతటిని నడిపిస్తున్న ఆ సకలాతీత శక్తికి అనుక్షణం ప్రణామాలు తెలుపుతూన్నా...

No comments:

Post a Comment