Pages

Showing posts with label kurna. Show all posts
Showing posts with label kurna. Show all posts

Saturday, September 24, 2016

కర్ణుడి క్షుద్బాధ;---

కర్ణుడి క్షుద్బాధ;---

కురుక్షేత్ర సంగ్రామం ముగిసింది. యుద్ధంలో మరణించిన వీరులందరూ వారి వారి పాపపుణ్యాల ఆధారంగా స్వర్గ నరకాలకు చేరుకున్నారు. వారిలో అత్యంత దానశీలిగా పేరు పొందిన కర్ణుడు స్వర్గలోకానికి వెళుతుండగా మార్గమధ్యంలో ఆకలిగా, దప్పికగా అనిపించింది. సమీపంలో ఉన్న కొలనులోని నీటిని దోసిలిలోకి తీసుకుని నోటిముందుకు చేర్చుకుని ఆత్రంగా తాగబోయాడు. చిత్రంగా ఆ నీరు కాస్తా బంగారు ద్రవంగా మారి, తాగడానికి పనికిరాకుండా పోయింది. ప్రయత్నించిన ప్రతిసారీ అంతే అయింది. ఈలోగా విపరీత మైన ఆకలి వేయడంతో కంటికి ఎదురుగా ఉన్న ఓ ఫలవృక్షాన్ని సమీపించి, చేతికి అందేంత దూరంలో ఉన్న ఓ పండును కోశాడు.

మధురమైన వాసనలతో ఉన్న ఆ పండు ఆయన క్షుద్బాధను ఇనుమడింప జేయడంతో వెంటనే పండు కొరికాడు. పండు కాస్తా పంటికింద రాయిలా తగిలి నొప్పి కలిగింది. మరో పండు కోశాడు. మళ్ళీ అదే అనుభవం ఎదురయింది. ఏది తిన్నా, ఏది తాగబోయినా మొత్తం బంగారుమయంగా మారిపోతున్నాయి తప్పితే ఆకలి, దాహం తీరడం లేదు. దాంతో కర్ణుడు తన ఆకలి దప్పులు తీరే మార్గం లేక నిరాశా నిస్పృహలతో ఒక చోట కూలబడిపోయాడు. అప్పుడు ‘‘కర్ణా! నీవు దానశీలిగా పేరొందావు. చేతికి ఎముక లేకుండా దానాలు చేశావు. అయితే బంగారం, వెండి, ధనం రూపేణా చేశావు గానీ కనీసం ఒక్కరికి కూడా అన్నం పెట్టి వారి ఆకలి తీర్చలేదు. అందువల్లే నీకీ పరిస్థితి ఏర్పడింది’’ అని అశరీరవాణి పలికింది.

అప్పుడు గుర్తుకొచ్చింది కర్ణుడికి ఒక సందర్భంలో ఒక పేద బ్రాహ్మడు తనను ఆకలితో కడుపు నకనకలాడిపోతోంది మహారాజా! ముందు నాకింత అన్నం పెట్టించండి మహాప్రభో అని నోరు తెరిచి అడిగాడు కూడా! అయితే అపార ధనవంతుడను, అంగరాజ్యాధిపతిని అయిన నేను పేదసాదలకు అన్నం పెట్టి పంపితే, వారు నన్ను చులకనగా చూస్తారేమో, ఆ విషయం నలుగురికీ తెలిస్తే నవ్వుకుంటారేమో అని అహంకరించి, సేవకులతో సంచీడు బంగారు నాణేలను తెప్పించి, అతని వీపుమీద పెట్టించడంతో, ఆ బరువును మోయలేక అతను అక్కడే చతికిలబడటం, తాను తిరస్కారంగా చూసి, భటుల చేత గెంటించడం గుర్తుకొచ్చింది.

బంగారం వెండి ధనం వజ్రవైఢూర్యాలను దానం చేయడమే గొప్ప. వాటిని దానం చేయబట్టే కదా తనకు దానకర్ణుడనే పేరొచ్చింది...  అన్నం మెతుకులంటే ఎవరైనా పెడతారు, ఇక తన గొప్పేముంది అని ఆలోచించాడు కానీ, ఆకలన్నవాడికి ముందు అన్నం పెట్టి కడుపు నింపడం కనీస బాధ్యత అని గుర్తించలేదు. దాని పర్యవసానం ఇంత తీవ్రంగా ఉంటుందనుకోలేదు... బతికి ఉండగా చేయలేని అన్నదాన కార్యక్రమాన్ని ఇప్పుడు ఎలా అమలు పర చగలడు? కర్తవ్యం ఏమిటి? అని ఆలోచించగా తన తండ్రి అయిన సూర్యదేవుడు గుర్తుకొచ్చాడు.

సూర్యుని వద్దకెళ్లి జరిగిన విషయమంతా వివరించి పరిపరివిధాల ప్రాధేయపడ్డాడు. సూర్యుడు తమ రాజైన మహేంద్రునికి విన్నవించాడు. చివరకు దేవతలంతా కలసి ఆలోచించుకుని కర్ణుడికి ఒక అపురూపమైన అవకాశమిచ్చారు. అదేమంటే, సశరీరంగా భూలోకానికెళ్లి అక్కడ ఆర్తులందరికీ అన్న సంతర్పణ చేసి తిరిగి రమ్మన్నారు. దాంతో కర్ణుడు భూలోకానికి భాద్రపద బహుళ పాడ్యమినాడు వెళ్లి, అన్న సంతర్పణ చేశాడు. పితరులకు తర్పణలు వదిలి తిరిగి భాద్రపద అమావాస్యనాడు స్వర్గానికెళ్లాడు.

కర్ణుడు భూలోకంలో ఉన్న కాలానికే మహాలయ పక్షమని పేరు. ఎప్పుడైతే అన్నసమారాధనతో అందరి కడుపులూ నింపాడో అప్పుడే కర్ణుడికి కూడా కడుపు నిండిపోయింది. ఆకలి, దప్పిక ఆయనను ఎన్నడూ బాధించలేదు.
ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టి కడుపు నింపాలి కానీ డబ్బు, బంగారం దానం చేస్తే ప్రయోజనం ఏముంటుంది? అన్నం పెట్టి, ఆకలి తీర్చినవారిని అన్నదాతా సుఖీభవ అని నిండు మనసుతో ఆశీర్వదిస్తారు. పితృదేవతల పేరిట ఆలయాలలో అన్నదానం చేయించడం వల్ల పేదల కడుపు నిండుతుంది, పితృలోకంలో ఉన్నవారికి ఆత్మశాంతి కలుగుతుంది.
సేకరణ
ధర్మ ప్రచారం