Pages

Sunday, September 25, 2016

🍁MUST READ కళ్ళు తెరిపించే గొప్ప నీతి కథ..

🍁MUST READ
కళ్ళు తెరిపించే గొప్ప నీతి కథ..

అనగనగా ఒక నగరంలో లక్ష్మీపతి అనే ఒకతను ఉండేవాడు. అతనికొక సంకల్పం. వాళ్ళ ఇంటికి దగ్గరలో ఒక అందమైన భవనం ఉండేది. ఎవరిదా ఇల్లు అని అడిగితే, ఎవరో కోటీశ్వరుడి ఇల్లు అని సమాధానం వచ్చేది. అం దుకే అనుకున్నాడు, ఏనాటికైనా ఈ నగరంలోని కోటీశ్వరుల జాబితాలో తను కూడా చేరాలి అని.

దానికోసం యవ్వనం నుంచి కష్టపడ్డాడు. బాగా కష్టపడ్డాడు. రాత్రింబవళ్ళూ కష్టపడ్డాడు. సంపాదనే సర్వస్వంగా కష్టపడ్డాడు. నలభై ఏళ్ళ లోపే కోటీశ్వరుడయ్యాడు. ఒక కోటి తర్వాత మరో కోటి. అలాఅలా యాభై ఏళ్ళ లోపే ఎన్నో కోట్లు కూడ బెట్టాడు. ఒకప్పుడు తను చూసిన అందమైన భవనాల్లాంటివి రెండుమూడు కట్టించాడు. అయినా తృప్తి కలగలేదు. ఇప్పుడున్న ఇళ్ళు కాకుండా నగరం మధ్యలో తన హోదాను చాటేలా, తన ప్రత్యేకత తెలిసేలా ఇంద్రభవనం లాంటి ఒక ఇల్లు కట్టాలి అనుకున్నాడు. దానికోసం మరింత కష్ట పడ్డాడు.

అనుకున్నది సాధించాడు లక్ష్మీపతి. నగరం నడిబొడ్డున విశాలమైన స్థలంలో, అత్యాధునిక సౌకర్యాలు కలిగిన అద్భుత భవనం  కట్టించాడు. గృహ ప్రవేశం రోజున నగరంలోని ప్రముఖులందరినీ ఆహ్వానించాడు. ఒక్కో దేశం తాలూకు విశిష్టతలన్నీ ఒక్క చోటే పోగుపడ్డట్టుగా ఉన్న ఆ ఇంటిని చూసి 'ఔరా' అని ఆశ్చర్యపోయారు అందరూ. శభాష్ అంటూ లక్ష్మీపతిని అభినందించారు.
🍃🍃🍃
అతిథులంతా వెళ్ళిపోయాక తన పడకగదికి వెళ్ళి పడక మీద నడుము వాల్చాడు లక్ష్మీపతి. భార్యా పిల్లలు ఇంకా ఫోన్లలో స్నేహితులతో మాట్లాడుతున్నారు. ఇంటి విశిష్టతలు, వచ్చిన అతిథుల కామెంట్లు, ఖర్చు పెట్టిన డబ్బు గురించి గొప్పగా స్నేహితులకు చెప్పుకుంటున్నారు. లక్ష్మీపతికి ఈ రోజెందుకో కంటి నిండా నిద్రపోవాలనిపిస్తోంది.

నెమ్మదిగా కన్ను మూత పడుతుండగా, 'నేను వెళ్తున్నా' అంటూ చెవిలో ఎవరో గుసగుసలాడుతున్నట్టు అన్నారు. కళ్ళు తెరచి చూస్తే ఏమీ కనిపించడం లేదు. అంతా చీకటిగా ఉంది.
ఎవరది? అన్నాడు లక్ష్మీపతి. కానీ తన గొంతుకు ఎందుకో ప్రతిధ్వనించినట్టుగా అనిపించింది.
నేను నీ ఆత్మను, నేను వెళ్తున్నా' ప్రతిధ్వనించినట్టుగానే వచ్చింది సమాధానం.💓
అదేంటి! నువ్వెళ్ళిపోతే నేను చచ్చిపోతాను కదా! కంగారుగా అన్నాడు లక్ష్మీపతి.
అవును! ప్రతిధ్వనించింది ఆత్మ
వద్దు వెళ్ళకు! చూడు ఎంత అందంగా, గొప్పగా కట్టించానో ఈ భవంతిని. ఎంత డబ్బు సంపాదించి పెట్టానో చూడు. ఇవన్నీ నీ కోసమే కదా. నిన్ను సుఖపెట్టడానికే కదా. నీ తృప్తి కోసమే కదా. ఉండు. నాలోనే ఉండి ఇవన్నీ అనుభవించు' అన్నాడు లక్ష్మీపతి.
అనుభవించాలా? ఎలా? నీ శరీరానికి డయాబెటిస్ కాబట్టి  తీపి పదార్థం తినలేను, నీ శరీరానికి బీపీ సమస్య ఉంది కాబట్టి కారం మీద మమకారం చంపుకున్నాను. ఇష్టమైనది ఏదీ తినలేను, ఎందుకంటే నీ శరీరం అరిగించుకోలేదు కాబట్టి. నీ శరీరం మొత్తం కళ్ళ నుండి కాళ్ళ వరకు మొత్తం ఒక రోగాల పుట్ట. ఆ పొట్ట చూడు బానలాగా ఎలా ఉబ్బిపోయిందో. అడుగు తీసి అడుగు వేయడానికి నువ్వెంత ఆయాస పడతావో మనిద్దరికీ తెలుసు. నువ్వే చెప్పు నీ శరీరంలో ఎలా ఉండను? ఎక్కడికక్కడ శిధిలమైపోయిన ఇంట్లో ఎవరైనా ఉంటారా? నువ్వు కట్టించుకున్న అందమైన ఇంటితో నాకేంటి సంబంధం? నేనుండేది నీ శరీరంలో. అదే నా నివాసస్థలం. నా ఇంటికి ఉన్న తొమ్మిది ద్వారాలకూ సమస్యలే. నాకు రక్షణ లేదు. సుఖం లేదు.
అన్నిటికన్నా నీకు ముందుగా వచ్చిన జబ్బు .. డబ్బు జబ్బు. నీకు అది వచ్చిన నాటి నుండి నన్నసలు నిద్ర పోనిచ్చావా? నేనుండే ఈ శరీరాన్ని విశ్రాంతి తీసుకోనిచ్చావా? ప్రతి క్షణం ఇంకొకడితో పోటీపడి నాలో అసూయ నింపావు. ఇంకొకడిని వెనక్కు తోయడానికి నాతో కుట్రలు చేయించావు. ఎన్నిసార్లు నన్ను పగతో రగిలిపోయేలా, ఈర్ష్యతో కుళ్ళిపోయేలా చేసావో గుర్తుకుతెచ్చుకో. రోగాలు చుట్టుముడుతున్నా ఏనాడైనా పట్టించుకున్నావా? ఇక నేనుండలేను వెళ్తున్నా!'
ఆ రాత్రి తాను కూడబెట్టిన లక్ష్మిని ఇక్కడే వదిలిపెట్టి, లక్ష్మీపతి స్వర్గానికో, నరకానికో మొత్తానికి కానరాని లోకాలకు వెళ్ళిపోయాడు.

👪 ప్రతి మనిషికీ రేపటి గురించిన ఆందోళన ఎక్కువయ్యింది. దాంతో ఈ రోజు, ఈ క్షణాన్ని ఆనందించడం మరచిపోతున్నాడు. దేవుడిచ్చిన ఆరోగ్యమే మహాభాగ్యం అన్న విషయాన్ని మరచి, మనిషి సృష్టించుకున్న డబ్బునే భాగ్యం అనుకుంటున్నాడు. ఒకమాటలో చెప్పాలంటే రోగాలకు రమ్మని ఆహ్వానం పంపి, అవి వస్తే ఖర్చు పెట్టేందుకు ఈరోజు కష్టపడి డబ్బు సంపాదిస్తున్నాడు. మన అవసరాలు తీర్చుకోడానికి కష్టపడాలి. ఆనందించడానికి కష్టపడాలి. మనం ఉండే జీవితం కోసం కష్టపడాలి. అంతే కాని మనం పోయిన తర్వాత లేని జీవితం గురించి కష్టపడటంలో రీజనింగ్ ఉందా?🙇
మీ......

Saturday, September 24, 2016

యముడి కొడుకు యమహా!

యముడి కొడుకు యమహా!
ఓసారి యముడు భూలోకానికి వచ్చినప్పుడు ఓ అందాల సుందరిని చూశాడు. ఎలాగైనా ఆమెను పెళ్లి చేసుకోవాలని అతడికి అనిపించింది. వెంటనే మనిషి రూపం ధరించి ఆమెను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. ఆమె అందమైనదే కానీ ఒట్టి గయ్యాళి. పెళ్లయిన మర్నాటి నుంచే చీటికీ మాటికీ అతడిని సాధించేది. ఆమె మీద ఉండే ప్రేమతో యముడు అదంతా భరించేవాడు. కొన్నాళ్లకు వారికో ఓ కొడుకు పుట్టాడు.

కొడుకు యువకుడయ్యేసరికి యముడికి భార్యంటే మొహం మొత్తింది. ఆమె గొంతు వింటేనే కంపరం పుట్టుకొచ్చేది. ఇక ఎంత మాత్రం ఆమెను భరించలేనని నిర్ణయించుకున్న యముడు తన కొడుకును దగ్గరకు పిలిచి జరిగిందంతా చెప్పి, 'ఇక నాకు ఈ జీవితంపై విరక్తి కలిగింది. నా కొడుకుగా నీకొక గొప్ప రహస్యం చెబుతా. నువ్వు వైద్య వృత్తిని ప్రారంభించు. నువ్వు ఏ రోగిని చూసినా అతడికి నయం అయ్యేటట్టు వరమిస్తున్నా. అయితే ఏ రోగి తల దగ్గరైనా నేను కనిపిస్తే మాత్రం వైద్యం చేయకు. ఎందుకంటే వాళ్ల చావు తప్పదన్నమాట' అంటూ అదృశ్యమైపోయాడు. తండ్రి చెప్పినట్టే ఆ యువకుడు వైద్యవృత్తిని చేపట్టి గొప్ప హస్తవాశి కలవాడుగా పేరుపొందాడు. ఓసారి ఆ దేశపు రాకుమారికి తీవ్రమైన అనారోగ్యం ఏర్పడింది. పెద్ద పెద్ద వైద్యులు కూడా నయం చేయలేకపోయారు. రాజు వెంటనే రాజ్యమంతటా చాటింపు వేయించి రాకుమారి జబ్బు తగ్గించినవారికి ఆమెనిచ్చి పెళ్లి చేయడంతో పాటు రాజ్యాన్ని కూడా అప్పగిస్తానంటూ ప్రకటించాడు.

ఆ ప్రకటన విన్న యువకుడు ఉత్సాహంగా రాజధాని బయల్దేరి రాకుమారిని చూశాడు. ఆమెను పరీక్షిస్తూ చుట్టూ చూసేసరికి తలదగ్గర తండ్రి కనిపించాడు. ఆమె చనిపోక తప్పదని అతడికి అర్థం అయింది. రాకుమారిని రక్షిస్తే జీవితాంతం సుఖంగా బతకవచ్చనుకున్న యువకుడికి ఏం చేయాలో తోచలేదు. కాసేపు ఆలోచించిన అతడికి ఓ ఉపాయం తోచింది. వెంటనే గది గుమ్మం వరకూ పరిగెత్తి బయటకి చూస్తూ, 'అమ్మా! త్వరగా రా. నాన్నగారు ఇక్కడే ఉన్నారు' అంటూ అరిచాడు.

కొడుకు కేక వినగానే యమభటుడికి చెమటలు పట్టాయి. గయ్యాళి భార్యను చూడవలసి వస్తుందనే భయంతో చటుక్కున అదృశ్యమైపోయాడు. దాంతో ఆ యువకుడి వైద్యం ఫలించింది. రాకుమారిని పెళ్లాడి, రాజవ్వాలన్న అతడి ఆశ కూడా నెరవేరింది!

కర్ణుడి క్షుద్బాధ;---

కర్ణుడి క్షుద్బాధ;---

కురుక్షేత్ర సంగ్రామం ముగిసింది. యుద్ధంలో మరణించిన వీరులందరూ వారి వారి పాపపుణ్యాల ఆధారంగా స్వర్గ నరకాలకు చేరుకున్నారు. వారిలో అత్యంత దానశీలిగా పేరు పొందిన కర్ణుడు స్వర్గలోకానికి వెళుతుండగా మార్గమధ్యంలో ఆకలిగా, దప్పికగా అనిపించింది. సమీపంలో ఉన్న కొలనులోని నీటిని దోసిలిలోకి తీసుకుని నోటిముందుకు చేర్చుకుని ఆత్రంగా తాగబోయాడు. చిత్రంగా ఆ నీరు కాస్తా బంగారు ద్రవంగా మారి, తాగడానికి పనికిరాకుండా పోయింది. ప్రయత్నించిన ప్రతిసారీ అంతే అయింది. ఈలోగా విపరీత మైన ఆకలి వేయడంతో కంటికి ఎదురుగా ఉన్న ఓ ఫలవృక్షాన్ని సమీపించి, చేతికి అందేంత దూరంలో ఉన్న ఓ పండును కోశాడు.

మధురమైన వాసనలతో ఉన్న ఆ పండు ఆయన క్షుద్బాధను ఇనుమడింప జేయడంతో వెంటనే పండు కొరికాడు. పండు కాస్తా పంటికింద రాయిలా తగిలి నొప్పి కలిగింది. మరో పండు కోశాడు. మళ్ళీ అదే అనుభవం ఎదురయింది. ఏది తిన్నా, ఏది తాగబోయినా మొత్తం బంగారుమయంగా మారిపోతున్నాయి తప్పితే ఆకలి, దాహం తీరడం లేదు. దాంతో కర్ణుడు తన ఆకలి దప్పులు తీరే మార్గం లేక నిరాశా నిస్పృహలతో ఒక చోట కూలబడిపోయాడు. అప్పుడు ‘‘కర్ణా! నీవు దానశీలిగా పేరొందావు. చేతికి ఎముక లేకుండా దానాలు చేశావు. అయితే బంగారం, వెండి, ధనం రూపేణా చేశావు గానీ కనీసం ఒక్కరికి కూడా అన్నం పెట్టి వారి ఆకలి తీర్చలేదు. అందువల్లే నీకీ పరిస్థితి ఏర్పడింది’’ అని అశరీరవాణి పలికింది.

అప్పుడు గుర్తుకొచ్చింది కర్ణుడికి ఒక సందర్భంలో ఒక పేద బ్రాహ్మడు తనను ఆకలితో కడుపు నకనకలాడిపోతోంది మహారాజా! ముందు నాకింత అన్నం పెట్టించండి మహాప్రభో అని నోరు తెరిచి అడిగాడు కూడా! అయితే అపార ధనవంతుడను, అంగరాజ్యాధిపతిని అయిన నేను పేదసాదలకు అన్నం పెట్టి పంపితే, వారు నన్ను చులకనగా చూస్తారేమో, ఆ విషయం నలుగురికీ తెలిస్తే నవ్వుకుంటారేమో అని అహంకరించి, సేవకులతో సంచీడు బంగారు నాణేలను తెప్పించి, అతని వీపుమీద పెట్టించడంతో, ఆ బరువును మోయలేక అతను అక్కడే చతికిలబడటం, తాను తిరస్కారంగా చూసి, భటుల చేత గెంటించడం గుర్తుకొచ్చింది.

బంగారం వెండి ధనం వజ్రవైఢూర్యాలను దానం చేయడమే గొప్ప. వాటిని దానం చేయబట్టే కదా తనకు దానకర్ణుడనే పేరొచ్చింది...  అన్నం మెతుకులంటే ఎవరైనా పెడతారు, ఇక తన గొప్పేముంది అని ఆలోచించాడు కానీ, ఆకలన్నవాడికి ముందు అన్నం పెట్టి కడుపు నింపడం కనీస బాధ్యత అని గుర్తించలేదు. దాని పర్యవసానం ఇంత తీవ్రంగా ఉంటుందనుకోలేదు... బతికి ఉండగా చేయలేని అన్నదాన కార్యక్రమాన్ని ఇప్పుడు ఎలా అమలు పర చగలడు? కర్తవ్యం ఏమిటి? అని ఆలోచించగా తన తండ్రి అయిన సూర్యదేవుడు గుర్తుకొచ్చాడు.

సూర్యుని వద్దకెళ్లి జరిగిన విషయమంతా వివరించి పరిపరివిధాల ప్రాధేయపడ్డాడు. సూర్యుడు తమ రాజైన మహేంద్రునికి విన్నవించాడు. చివరకు దేవతలంతా కలసి ఆలోచించుకుని కర్ణుడికి ఒక అపురూపమైన అవకాశమిచ్చారు. అదేమంటే, సశరీరంగా భూలోకానికెళ్లి అక్కడ ఆర్తులందరికీ అన్న సంతర్పణ చేసి తిరిగి రమ్మన్నారు. దాంతో కర్ణుడు భూలోకానికి భాద్రపద బహుళ పాడ్యమినాడు వెళ్లి, అన్న సంతర్పణ చేశాడు. పితరులకు తర్పణలు వదిలి తిరిగి భాద్రపద అమావాస్యనాడు స్వర్గానికెళ్లాడు.

కర్ణుడు భూలోకంలో ఉన్న కాలానికే మహాలయ పక్షమని పేరు. ఎప్పుడైతే అన్నసమారాధనతో అందరి కడుపులూ నింపాడో అప్పుడే కర్ణుడికి కూడా కడుపు నిండిపోయింది. ఆకలి, దప్పిక ఆయనను ఎన్నడూ బాధించలేదు.
ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టి కడుపు నింపాలి కానీ డబ్బు, బంగారం దానం చేస్తే ప్రయోజనం ఏముంటుంది? అన్నం పెట్టి, ఆకలి తీర్చినవారిని అన్నదాతా సుఖీభవ అని నిండు మనసుతో ఆశీర్వదిస్తారు. పితృదేవతల పేరిట ఆలయాలలో అన్నదానం చేయించడం వల్ల పేదల కడుపు నిండుతుంది, పితృలోకంలో ఉన్నవారికి ఆత్మశాంతి కలుగుతుంది.
సేకరణ
ధర్మ ప్రచారం