Pages

Thursday, February 16, 2017

నిత్యం ఎవరిని పూజించాలి…?

నిత్యం ఎవరిని పూజించాలి…?
సనాతన హైందవ ధర్మంలో ప్రతివారికి నిత్య పూజ ఒక భాగం.
అయితే ఈ విషయంలోనే అనేకమందికి అనేక సందేహాలు ఉంటాయి.

అసలు రోజూ ఏ దేవతని పూజించాలి ? ఏ దేవత ఫోటో ఇంట్లో ఉండాలి ? ఇలా అనేక సందేహాలతో సతమతమవుతూ ఉంటారు.

మీ సందేహాలు అన్నిటికి నా ఈ ఆర్టికల్ ఉపయోగం అవుతుంది అని భావిస్తూ రాస్తున్నాను.

పూజా మందిరం లో ఎన్ని విగ్రహాలు ఉండాలి ?

ఆదిత్య గణనాథంచ దేవీం రుద్రంచ కేశవం ! పంచ దైవత్వమిత్యుక్తం సర్వ కర్మసు పూజయేత్ !  ( మత్స్య పురాణం ).

పై శ్లోకం పంచాయతనం గురించి వివరణ ఇస్తుంది.

1 . ఆదిత్యుడు అనగా సూర్యుడు – ఇతను ఆరోగ్య ప్రదాత ! ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అని శాస్త్ర వచనం. ఆరోగ్యమే మహా భాగ్యం కదా !

2. గణనాథం అనగా గణపతి – ఇతను విఘ్నాలు తొలగించేవాడు! అన్ని పనులు విజయవంతం కావలి అంటే ఈయన అనుగ్రహం కావాలి !

3. దేవీం అనగా అమ్మవారు – ఈమె త్రిశక్తి  రూపిని కాళి – లక్ష్మి – సరస్వతి రూపిణి. శక్తి  – ధనం-విద్య  ఈమూడు అత్యవసరం కదా !

4. రుద్రం అనగా శివుడు –

5. కేశవం అనగా విష్ణువు –  …శివ కేశవుల అనుగ్రహం కోసమే మానవ జన్మ లక్ష్యం !

మనలో ప్రతి ఒక్కరూ ఈ 5 మంది దేవతలను నిత్యం పూజించాలి. ఇంకా అనేక విగ్రహాలు ఇంట్లో అవసరం లేదు.

అలా అని ఉన్నవాటిని పారేయమని నా ఉద్దేశం కాదు. పూజా మందిరం లో తక్కువ విగ్రహాలు ఉంటే మందిరం శుభ్రంగా ఉండడమే కాకుండా పూజ కూడా ప్రశాంతంగా శ్రద్ధగా చేసుకోవడం జరుగుతుంది.

ఒకే దేవుని విగ్రహం ఒకటే ఉంటే మంచిది. ఒకే దేవుని విగ్రహాలు ఎక్కువ ఉంటే ఇంటికి కీడు దోషము అనే మాటలు నమ్మకండి. భగవంతుడు మనకు మేలు చేసేవాడే కానీ కలలో కూడా కీడు చేయడు అని గ్రహించండి. అలాంటి శాడిస్టు తనం దైవంలో ఉండదు.

దేవుని పటాలు కూడా ఎక్కువగా ఉండకుండా జాగ్రత్త పడాలి. ఇష్ట దేవత కులదేవతల ఫోటోలు కచ్చితంగా ఉండాలి.

పైన పంచాయతనం లో అనగా 5 విగ్రహాలలో శివుడు  మధ్యలో ఉండి చుట్టూ కింద చిత్రంలో ఉండేట్టు పెట్టుకోవడంని ” శివ పంచాయతనం ” అంటారు.

విష్ణువు మధ్యలో ఉంటే అది విష్ణు పంచాయతనం, అమ్మవారు మధ్యలో ఉంటే అది అంబికా పంచాయతనం, గణపతి మధ్యలో ఉంటే అది

” గణేష పంచాయతనం ”,  సూర్యుడు మధ్యలో ఉంటే అది ” ఆదిత్య పంచాయతనం” అంటారు.

పూజా మందిరం ఎప్పుడు కూడా శుభ్రంగా ఉండాలి. అనవసర వస్తువులు, చెత్త చెదారం అసలు ఉండకూడదు.

శ్రద్ధతో రోజు షోడశ ఉపచార పూజ చేయాలి. సమయం దొరకని వారు పంచోపచార పూజ చేయవచ్చు. భక్తి మాత్రమే ప్రధానం.

పంచోపచార పూజ విధానం :

చాలా మందికి నిత్యం శాస్త్రోక్తంగా పూజ చేసుకోవాలనే కోరిక ఉంటుంది కానీ ఈ యాంత్రిక జీవనంలో సమయాభావం వల్ల ఏదో ‘ అయ్యింది ‘ అనిపిస్తుంటారు. కొద్ది సమయంలో శాస్త్రోక్తంగా ఎలా పూజ చేసుకోవాలి…ఇప్పుడు తెలుసుకుందాం !

ముందుగా దేవతా మందిరం శుభ్రం చేసుకోవాలి !
ముందు రోజు పెట్టిన పుష్పములను తీసివేయాలి, దీనినే నిర్మాల్యమ్ అంటారు !
దీపారాధన చేసుకోవాలి !
దేవతా విగ్రహములు లేదా పటములు శుభ్రం చేసుకుని అలంకరించుకుని పెట్టుకోవాలి !
అక్షింతలు తీసుకుని ఆయా దేవతలను ధ్యానించి అక్షింతలు వారి పైన వేసి నమస్కరించాలి !
లం – పృథివీ తత్వాత్మనె గంధం సమర్పయామి..అని గంధమ్ పసుపు కుంకుమ వేయాలి !
హం – ఆకాశ తత్వాత్మనె పుష్పం సమర్పయామి..అని పుష్పం సమర్పించాలి !
యం- వాయు తత్వాత్మనె ధూపం సమర్పయామి..అని ధూపం వేయాలి !
రం – తేజః తత్వాత్మనె దీపం సమర్పయామి..అని దీపం చూపించాలి !
వం – అమృత తత్వాత్మనె నైవేద్యం సమర్పయామి..అని నైవేద్యం సమర్పించాలి !
సం – సర్వ తత్వాత్మనె తాంబూలం సమర్పయామి..అని తాంబూలం సమర్పించాలి !
చివరికి హారతి ఇచ్చి ప్రదక్షిణాలు చేసి ‘ మంత్ర హీనం..’ అని అక్షితలు వదిలేయాలి.
ఇది సూక్ష్మము మరియు శాస్త్రోక్తము. దీనిని పంచొపచార పూజ అంటారు.
ఇంకా సోమవారం శివార్చన, మంగళవారం హనుమ ఆరాధన, బుధవారం రాముని పూజ, గురువారం గురువుల పూజ, శుక్రవారం దేవీ ఆరాధన, శని వారం వెంకటేశ్వర ఆరాధన, ఆదివారం సుర్యారాధన కూడా పటములకు చేసుకోవచ్చు.
మనం ఎంత పూజ చేసినా పూజా మందిరం శుభ్రంగా లేకపోతె ఆ పూజలు అన్నీ నిష్ఫలం అవుతాయి.
దరిద్ర దేవత రావడం , దేవుడు శపించడం , అరిష్టం జరగడం ఇలాంటివి అన్నీ మనల్ని భయపెట్టడానికి చెప్పేవే కానీ అందులో నిజాలు లేవు.
దైవారాధనలో చేసే భక్తి ప్రధానం. భగవంతుడు వరాలు మాత్రమే ఇస్తాడు. శాపాలు ఇవ్వదు

No comments:

Post a Comment