కర్మఫలం!
ఒక వ్యక్తి ఉపాహారం తీసుకునేందుకు ఫలహారశాలకెళ్లాడు. చెల్లించవలసిన మూల్యం గురించి భయపడ్తూ ధారాళంగా తినేందుకు జంకుతున్నాడు. అక్కడి పదార్థాలను పంపిణీ చేసే ఉద్యోగి ''మీ రంతగా భయపడవలసింది లేదు. బిల్లు మీరు చెల్లించనక్కరలేదు. భవిష్యత్తులో రాబోయే మీ మనవల నుంచి వసూలు చేస్తాం'' అన్నాడు. తాను తిన్నదానికి తానే చెల్లించవలసిన అవసరం లేదని తెలుసుకున్న ఆ వ్యక్తి పరమానందభరితుడై అవసరమైన దానికంటే అధికంగానే తిని తృప్తిగా లేచిపోతుండగా ఆ ఉద్యోగి వేల రూపాయలతో కూడిన బిల్లు తెచ్చి ముందుపెట్టాడు. నిజానికతను తిన్నది వందలోపే. తెల్లబోయి ఇదేమిటని ప్రశ్నించాడు ఆ వ్యక్తి. ''మీరు తిన్నది మీ మనవలు చెల్లించబోతున్నప్పుడు మరి మీ తాతలు తిన్నది మీరు కట్టవలసిందే కదా?'' అన్నాడు నింపాదిగా.
ఎవరి కర్మఫలాలను వాళ్లే అనుభవించవలసి ఉంది అని తెలిసి కూడా ఇంత దుబారాగా దుష్కర్మలు చేసే లోకులు తమ కర్మఫలాలను ఇతరులు అనుభవిస్తారనే వెసులుబాటు ఉంటే ఇంకెంత విశృంఖలంగా ఉండేవారో కదా!? కర్మ సిద్ధాంతాన్ని పూర్తిగా నమ్మి మన భవిష్యత్తును మనమే నిర్మించుకునే ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంటే, మన బిల్లును మనమే కట్టవలసిన అనివార్యతను గుర్తుంచుకుంటే అప్రమత్తులమై కర్మలనాచరించి అమృత పుత్రులమనే మన స్వనామానికి సార్థకత చేకూర్చగలం............
No comments:
Post a Comment