Pages

Showing posts with label Kathmaraaju. Show all posts
Showing posts with label Kathmaraaju. Show all posts

Monday, February 6, 2017

ఇప్పుడు  " కాటమరాయుడు " గురించి చర్చ జరుగుతుంది.

ఇప్పుడు  " కాటమరాయుడు " గురించి చర్చ జరుగుతుంది.

.
" కాటమరాజు "  కనిగిరి (ప్రకాశం జిల్లా) ని పరిపాలించిన యాదవరాజు.
ఇతని కోట కనిగిరిదగ్గర పంచలింగాల కొండ దిగువన ఉండేది. ఇతడు మహాపరాక్రమ సంపన్నుడు.
ఏడు సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడే తండ్రి పగదీర్చటానికి
కాటమరాజు వాలికేతు రాజును సంహరించి విజయం సాధించాడు. ఇతనికి విస్తారమైన పశు సంపద
ఉండేది. కాటమరాజు "ఆవులమంద కుదిరితే ఆరామడ, చెదిరితే పన్నెండామడ" అని ప్రతీతి.
పద్మరాఘవుడు కాటమరాజు మంత్రి. అతనిని పద్మనాయకుడని కూడా అంటారు. తన భుజబలానికి
పద్మనాయకును నీతి బలం తోడు కాగా కాటమరాజు నేర్పుతో రాజ్యం చేశాడు.
ఒకప్పుడు వానలు లేక కరువుకాటకాలు కనిగిరి సీమను పీడించాయి. పశువులు మేతకై వెంపరలాడ
మొదలు పెట్టాయి. ఆవులు, ఎద్దులు, కోడె దూడలు, లేగలు, అన్నీ మలమల మాడిపోతున్నాయి.
ఈ స్థితిని చూచిన కాటమరాజు కడుపు.రంపంతో కోసినట్లు ఏదో చెప్పరాని బాధ. తన మంత్రి
పద్మనాయకునితో కర్తవ్యం ఆలోచించాడు. "నెల్లూరి సీమలో పచ్చికబీళ్ళు, అడవులు విస్తారంగా
ఉన్నాయి. నెల్లూరి ఏలిక నల్లసిద్ధిని ప్రార్థించి అక్కడి పచ్చిక బయళ్ళలో ఆలమందల్ని
మేపుతూ గండం గడపవచ్చు. అందుకు ప్రతిగా ఏటా మనం కొన్ని కోడెదూడల్ని రాజు కివ్వవచ్చు" నని
పద్మనాయకుడు తెలిపాడు. కాటమరాజుకు ఈ ఉపాయం నచ్చింది. వెంటనే అతడు నెల్లూరికి
సపరివారంగా ప్రయాణమయ్యాడు.
ఆనాటి నెల్లూరి ప్రభువు మనుమసిద్ధి కుమారుడైన నల్లసిద్ధి రాజు. నల్లసిద్ధి దగ్గర
సేనాపతిగా ఖడ్గతిక్కన, ప్రధానామాత్యుడుగా చింకర్ల భీమినీడు ఉండేవారు.
కాటమరాజు నల్లసిద్ధిని దర్శించి తమకు వచ్చిన ఆపదను తెలిపి సహాయం కోరాడు.
నల్లసిద్ధిరాజు అందుకంగీరించి అనుమతి పత్రం వ్రాయించి కాటమరాజుకిచ్చాడు. అడవులలో,
పచ్చికబయళ్ళలో పశువులను మేపినందుకు ప్రతి సంవత్సరం మందలోని కొన్ని
కోడెదూడలను ఇవ్వాలన్నది అందులోని ఏర్పాటు.
కాటమరాజు ఆలమందలు పచ్చికమేసి బలిసినందువల్ల పాడికొరత తీరింది. కానీ అడవుల్లో జీవించే
వారి భృతికి ఈ ఆలమందలు,వాటిని కాసేవారు అడ్డువచ్చారు. చిలకలు రొదచేస్తుండగా ఆవులు బెదిరి
పోయాయి. వెంటనే వాటిని బాణంతో పడగొట్టాడు పద్మనాయకుడు.వాటిలో నల్లసిద్ధి రెండోరాణి
కుందమాదేవి పెంపుడు చిలుక ఒకటి. ఇది తెలిసిన కుందమాదేవి గోవులను చంపండని
ఆటవీకులను ఆజ్ఞాపించింది. ఇందుకు కుపితుడైన కాటమరాజు ఏడాది దాటినా నల్లసిద్ధికి పుల్లరి
పంపలేదు. గోనష్టం జరిగిన విషయం నల్లసిద్ధికి తెలియదు.కానీ పుల్లరి చెల్లించవలసిందని
రాయబారిగా ఒక భట్టును పంపించాడు.
ఆ రాయబారి కాటమరాజు గుడారాలవద్దకు వెళ్ళాడు. నలభైనాలుగు స్తంబాల శిబిరంలో
కాటమరాజు కొలువుదీరి ఉన్నాడు. భట్టుమాటలు విని "మీరాజు చేయించిన గోనష్టానికి
మేము చెల్లించవలసిన పుల్లరికీ సరిపోయింది" పొమ్మన్నాడు.రాయ
బారం చెడినందుకు చింతిస్తూ భట్టు వెళ్ళిపోయాడు. కాటమరాజు పద్మనాయకునితో "రాయబారం చెడింది.
నల్లసిద్ధి మనపై ఎప్పుడైనా దండెత్తవచ్చు. మనం యుద్ధానికి సిద్ధంగా ఉండటం అవసరం.
మన వారందరికీ కమ్మలు వ్రాయించి యుద్ధ సన్నద్ధులై రావలసిందని కబురుపెట్టు" మన్నాడు.
మంత్రి తగిన ఏర్పాట్లు చేయించాడు.
రాయబారి తిరిగివచ్చి కాటమరాజు పుల్లరి చెల్లించ నిరాకరించాడని చెప్పగానే నల్లసిద్ధి
ఉగ్రుడయ్యాడు.. "పుల్లరి చెల్లించ నిరాకరించి కాటమరాజు కయ్యానికి కాలు దువ్వుతున్నాడు.
మనం మన మగటిమి చూపించవలసిన తరుణం ఆసన్నమైంది. రణరంగంలోకి దూకి మీ పరాక్రమాన్ని
ప్రకటించండి" అని హెచ్చరించాడు. మంత్రి చింకర్ల భీమినీడు యుద్ధరంగంలో సాయం చేయవలసిందని
కోరుతూ సామంత రాజులందరికీ లేఖలు వ్రాయించాడు. వెంటనే నెల్లూరి పరిసరాలు సైన్యాలతో
నిండిపోయాయి. దండనాయకుడు ఖడ్గతిక్కన ఎర్రగడ్డపాటి యుద్ధభూమిలో
కాటరాజు సైన్యాలను ఎదురించాడు. రెండు దళాలకూ సంకుల సమరమయ్యింది. ఖడ్గతిక్కన
సైన్యమంతా నేలకూలింది. అతడు ఏకాకి. తిక్కన చింతించి మళ్ళీ సైన్యాలతో వచ్చి
శత్రు నాశనం చేయవచ్చునని నెల్లూరికి తిరిగి పోయాడు.
తిరిగి వస్తున్న తిక్కనను పౌరులు ఎగతాళి చేశారు. ముదుసలి తండ్రి సిద్ధన "పగరకు వెన్నిచ్చి
పిరికి పందలా పారి వచ్చావు. నీ బ్రతుకు వ్యర్థ" మని తూలనాడాడు. భార్య చానమ్మ భర్త
స్నానం కొరకు మంచం అడ్డుగా ఉంచి పసుపుముద్ద నీళ్ళ పెరటిలో పెట్టింది. "ముగురాడువారమైతిమి"
అని వెక్కిరించింది. తల్లి పుత్రునికి విరిగిన పాలిచ్చి "పశువులతోపాటు పాలుకూడా విరిగిపోయాయి"
అన్నది. ఈ నిందలు భరించలేక ఖడ్గతిక్కన సైన్యసమేతంగా వెళ్ళి మళ్ళీ తలపడ్డాడు.
కాటమరాజు పక్షాన బ్రహ్మరుద్రయ్య అనే వీరుడు తిక్కనతో ఘోరయుద్ధం చేసి
తిక్కనను చంపి తానూ చచ్చాడు.
ఖడ్గతిక్కన మరణవార్త విన్న నల్లసిద్ధిరాజు అపారమైన సైన్యాలతో
కాటమరాజును ఎదుర్కొన్నాడు. సంకుల సమరం జరిగింది. అపుడు కాటమరాజు కృష్ణుని అవతారంగా
భావించిన బొల్లావును పూజించి నల్లసిద్ధి సేనలను తునుమాడమని ప్రార్థించాడు. బొల్లావు ఎందరో
శత్రువులను హతమార్చింది. అయితే నల్లసిద్ధి మాయోపాయంతో చంపించాడు.
కాటమరాజు నిరుత్సాహపడ్డాడు కానీ అతని సేనలు వెన్నుచూపలేదు. వారిలో ఒకడైన బీరినీడు ఒకే
దెబ్బకు మద్దిమాను నరికి తనకత్తికి పదును చూసుకొని నల్లసిద్ధి సైన్యాన్ని ఊచకోత
కోశాడు. కానీ అతనుకూడా వీరమరణం పొందక తప్పలేదు. బాలవీరుడు పోచయ్య విజృంభించి పోరాడి
వీరస్వర్గం చేరుకున్నాడు. కాటమరాజు సైన్యం బలహీనపడింది.
అప్పుడు కాటమరాజు మంత్రాలోచనచేసి నల్లసిద్ధి సైన్యం పైకి ఆవులను, ఎద్దులను పంపాలని
నిర్ణయించాడు. యాదవులు ఆవులను అశ్వాలపైకి, ఎడ్లను గజబలం మీదికి ఉరికించారు.
అవికాల్బలంతో కూడా ఘోరయుద్ధంచేసి మరణించాయి. కాటమరాజు స్వయంగా నల్లసిద్ధిని
ఎదుర్కొన్నాడు. వారి ద్వంద్వ యుద్ధం "దక్షుండు శంభుండు తారసిలినట్లు,
రామరావణులు కదసినట్లు, మత్స్యంబు మొసలియు మల్లాడినట్లి, వారిధి వారిధితో,
మేరువు మేరువుతో తాకినట్లు" జరిగింది. కాటమరాజు చేతిలో నల్లసిద్ధి నిహతుడయ్యాడు.
అతని సైన్యం కాలికి బుద్ధి చెప్పింది. ఈ ఘోర రణం కాటమరాజు విజయంతో ముగిసింది.
.JAI Kathmaraaju YADAV