Pages

Showing posts with label vikunta ekadasi. Show all posts
Showing posts with label vikunta ekadasi. Show all posts

Saturday, January 7, 2017

వైకుంఠ_ఏకాదశి

#వైకుంఠ_ఏకాదశి

దివి నుంచి భువికి దిగి వచ్చిన మూడు కోట్ల దేవతలకు గరుడ వాహనరూఢుడైన మహావిష్ణువు దర్శనాను గ్రహం ప్రాప్తించడం వల్ల ముక్కోటి ఏకాదశిగాను ఈ పర్వదినం ప్రాశస్త్యాన్ని సంతరించుకుంది. దీన్నే హరివాసరమని, హరిదినమని వైకుంఠ దినమని అంటారు.

ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమానమంటున్నారు పండితులు. ధనుర్మాసంలో వచ్చే ఈ ఏకాదశే సంవత్సరంలోని ఇరవై నాలుగు ఏకాదశులలో శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. ఈ వైకుంఠ ఏకాదశి నాడు "వైకుంఠ ఏకదశీ వ్రతం" ఆచరించిన వారికి శుభఫలితాలుంటాయి. పర్వత సలహా మేరకు వైఖానసుడనే రాజు ఈ వ్రతాన్ని ఆచరించి నరక బాధలు అనుభవిస్తున్న పితృదేవతలకు విముక్తి కలిగించాడని పురాణాలు చెబుతున్నాయి.

అలాగే కృత యుగంలో "ముర" అనే రాక్షసుడు దేవతులను, సాధువులను క్రూరంగా హింసించే వాడు. ముర అక్రమాలను భరించలేక దేవతలు నారాయణ స్వామి వద్ద మొరపెట్టుకున్నారు. భగవంతుడు మురాసురుడి మీదికి దండెత్తి, అతని వధించాడు. ముర వెళ్లి సాగర గర్భంలోకి వెళ్లి దాక్కుంటే, అతన్ని బైటికి రప్పించేందుకు ఉపాయం పన్ని గోవిందుడు గుహలోకి వెళ్లి నిద్రపోతున్నట్లు నటిస్తూ పడుకున్నాడు.

అదే అదననుకున్న మురాసురుడు గుహలోకి వచ్చి, విష్ణువును వధించేందుకు కత్తి ఎత్తగానే, మహాలక్ష్మి దుర్గ రూపంలో ప్రత్యక్షమై మురను సంహరించగా, ప్రసన్నుడైన పరమాత్మ ఆమెకు ఏకాదశి అన్న బిరుదు ప్రసాదించాడు. నాటి నుంచి ఏకాదశీ వ్రతం పేరుతో అమ్మవారిని అర్చిస్తామని పురోహితులు అంటున్నారు.

వైష్ణవ ఆళ్వారుల్లో శ్రీనమ్మాళ్వారులీ రోజున పరమపదించడం వల్ల శ్రీ వైష్ణవులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఏకాదశీ వ్రత మాచరిస్తారు. ప్రసిద్ధ వైష్ణవ దేవాలయాలతో సహా శ్రీ తిరుమల వేంకటేశ్వరుని ఆలయంలోను ప్రాత: కాలం నుంచీ ప్రత్యేక ఉత్తర ద్వార దర్శనం కలుగుతుంది. దీనికి వైకుంఠ ద్వారమని ప్రతీతి. సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశానికి ఉత్తర ద్వారం శుభ సంకేతం. దక్షిణాయనంలో మరణించిన పుణ్యాత్ములందరూ వైకుంఠ ద్వారం తెరిచినప్పుడు దాని గుండా స్వర్గంలోని ప్రవేశిస్తారని పురాణాలు చెబుతున్నారు.

అందుకే ఈ పర్వదినాన ఉపవాసముండి లక్ష్మీ సమేతుడైన శ్రీ మహావిష్ణువును షోడశోపచార విధితో ఆరాధించాలి. నిష్ఠతో దీక్షను ఆచరించి రాత్రి జాగరణ చేయాలి. ద్వాదశి రోజున మళ్లీ భగవదారాధన ముగించుకుని పారాయణ చేసి బ్రాహ్మణులను దక్షిణ తాంబూలాదులతో సత్కరించాలి.

ఉపవసించలేని వారు నెయ్యి, నీరు, పాలు, నువ్వులు, పండ్లు భుజించి ఉండవచ్చును. ముక్కోటి ఏకాదశి నడు చేసే విష్ణు పూజ, గీతా పారాయణం, గోవింద నామ స్మరణం, పురాణ శ్రవణం మోక్ష ప్రాప్తి కలిగిస్తాయి. ఇంకా ఏకాదశి వ్రతముండే వారికి మరు జన్మంటూ ఉండదని పురోహితులు చెబుతున్నారు.

దేవతలకు ఆరు నెలలు పగలు, ఆరు నెలలు రాత్రి. రాత్రిని దక్షిణాయనం, పగటిని ఉత్తరాయణం అన్నారు. దక్షిణాయనం వెళుతుండగా చీకటి తొలగి సూర్యుడు - అంటే వైకుంఠుడు, ముక్తుడుకాగా దేవతలు కూడా చీకటి పోయి వెలుతురుకు వస్తారన్నమాట. అనగా, వారి పగలు ప్రారంభమైందన్నమాట. ఈ వైకుంఠ ద్వారమన్నది సూర్యుని ఉత్తరాయణ ప్రవేశ చిహ్నముగా చెప్పుకుంటాము. ముక్కోటి దేవతలు ఈనాడు ఉత్తరమందున్న శ్రీ మహా విష్ణువును దర్శించుకుంటారు. అందుచే ప్రాతఃకాలంలో భక్తులుకూడా ముక్కోటి దేవతలతో కూడివున్న వైకుంఠుణ్ణి ఉత్తర ద్వార దర్శనం చేసుకుని ముక్తి పొందాలని భావిస్తారు. అందుకే దీన్ని మోక్షేకాదశి అని కూడా అంటారు.

పండుగ ఆచరించు విధానం:
ఈరోజు పూర్తిగా ఉపవసించాలి; తులసి తీర్థం తప్ప ఏదీ తీసుకోకూడదు. ద్వాదశి నాడు అతిథి లేకుండా భుజించకూడదు. ఈనాడు ఉపవసించినవారు పాప విముక్తులవుతారంటారు. ఉపవాసం వల్ల జీర్ణాశయానికి విశ్రాంతి లభించడం ఆరోగ్యప్రదం. ఆధ్యాత్మిక సాధకుల ఆరోగ్య సుస్థిరతకు ఉపవాసమొక దివ్యాస్త్రం. ఔషధం సేవించేటప్పుడు అనుపానంగా చేయవలసిన పథ్యమే ఉపవాసం. 'లంకణం పరమౌషధ'మనే నానుడి తెలిసిందే. ఉప అంటే దగ్గరగా, వాసం అంటే ఉండటం; దైవానికి దగ్గరవాలనేదే ఉపవాసంలోని ఆశయం. పూజ, జపం, ధ్యానం లేదా ఉపాసన మొదలైన సాధనల ద్వారా మనసును మాధవుడిపై లగ్నం చేయాలి.

ఏకాదశి వ్రతం నియమాలు :
1. దశమి నాడు రాత్రి నిరాహారులై ఉండాలి. 2. ఏకాదశి రోజు మొత్తం ఉపవాసం ఉండాలి. 3. అసత్య మాడరాదు. 4. స్త్రీ సాంగత్యం పనికి రాదు. 5. చెడ్డ పనులు, దుష్ట ఆలోచనలు చేయకూడదు. 6. ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి. 7. అన్నదానం చేయాలి.

ఆషాడ శుద్ధ ఏకాదశి.(తొలేకాదశి/శయనేకాదశి)
కార్తీక శుద్ధ ఏకాదశి
పుష్య శుద్ధ ఏకాదశి (వైకుంఠ ఏకాదశి/ముక్కోటి ఏకాదశి)
మాఘ శుద్ధ ఏకాదశి (భీష్మ ఏకాదశి)
వైకుంఠ ఏకాదశి/ ముక్కోటి ఏకాదశి.