Thursday, February 9, 2017
తెలుసుకోండీ... తెలియజేయండీ.... ఇష్టం అయితె ఏ పురాణంలో ఏముంది..?
తెలుసుకోండీ... తెలియజేయండీ....
ఇష్టం అయితె
ఏ పురాణంలో ఏముంది..?
మనం అనేక సందర్భాల్లో ‘అష్టాదశ పురాణాలు’ అని వింటూ ఉంటాం. అయితే ఆ పద్ధెనిమిది పురాణాల పేర్లూ ఒకపట్టాన గుర్తుకు రావు. ఒకవేళ అన్నింటిపేర్లూ తెలిసినా, ఏ పురాణంలో ఏముందో తెలియదు. అనంతంగా ఉన్న ఈ పౌరాణిక విజ్ఞానాన్ని, అపారమైన వేదరాశిని వేదవ్యాసుడే అంశాల వారీగా విభజించాడు. వేదవ్యాసుడు శ్రీ మహావిష్ణువు అంశ. అందుకే విష్ణుసహస్రనామంలో వ్యాసాయ విష్ణురూపాయ.. వ్యాసరూపాయ విష్ణవే అని ఉంటుంది. వేదవ్యాసుడు పురాణాలను రచిస్తే, వాటిని మహాపౌరాణికుడు సూతుడు శౌనకాది మునులకు చెప్పాడు. వారిద్వారా ఇవి లోకానికి వె ల్లడి అయ్యాయి. ఎంతో విస్తారమైన ఈ పురాణాలను మనం చదవలేకపోయినప్పటికీ, అసలు ఆ పురాణాలేమిటి, ఏ పురాణంలో ఏముందో రేఖామాత్రంగా అయినా తెలుసుకోగలిగితే అవకాశం ఉన్నప్పుడు విపులంగా తెలుసుకోవచ్చు.
18 పురాణాల పేర్లు ...
1. మత్స్యపురాణం
2. కూర్మపురాణం
3. వామన పురాణం
4. వరాహ పురాణం
5. గరుడ పురాణం
6. వాయు పురాణం
7. నారద పురాణం
8. స్కాంద పురాణం
9. విష్ణుపురాణం
10. భాగవత పురాణం
11.అగ్నిపురాణం
12. బ్రహ్మపురాణం
13. పద్మపురాణం
14. మార్కండేయ పురాణం
15. బ్రహ్మవైవర్త పురాణం
16.లింగపురాణం
17.బ్రహ్మాండ పురాణం
18. భవిష్యపురాణం
ఈ పురాణాలన్నీ శ్లోకాల రూపంలో ఉంటాయి. అన్నింటిలోకీ మార్కండేయ పురాణం చిన్నది కాగా, పద్మపురాణం పెద్దది.
*మత్స్యపురాణం*: మత్స్యరూపంలో ఉన్న మహావిష్ణువు మనువనే రాజుకు చెప్పిన ఈ పురాణంలో కాశీక్షేత్ర ప్రాశస్త్యం, యయాతి, కార్తికేయుడు వంటి రాజుల గొప్పదనాన్ని, ధర్మమంటే ఏమిటో, ఆ ధర్మాన్ని ఆచరించే విధానాలేమిటో విష్ణుమూర్తి వివరిస్తాడు.
*కూర్మపురాణం*: కూర్మావతారం దాల్చిన విష్ణుమూర్తి చెప్పిన ఈ పురాణంలోఖగోళ శాస్త్రం గురించి, వారణాసి, ప్రయాగ వంటి పుణ్యక్షేత్రాల గురించి వర్ణన కనిపిస్తుంది.
*వామన పురాణం*: పులస్త్య మహర్షి నారద మహామునికి చెప్పిన ఈ పురాణంలో శివపార్వతుల కల్యాణం, గణేశ, కార్తికేయుల జన్మవృత్తాంతాలు, రుతువుల గురించిన వర్ణనలు కనిపిస్తాయి.
*వరాహపురాణం*: వరాహావతారం దాల్చిన విష్ణువు భూదేవికి తన జన్మవృత్తాంతం, ఉపాసనా విధానం, ధర్మశాస్త్రాలు, వ్రతకల్పాలు, భూమిపై ఉన్న వివిధ రకాల పుణ్యక్షేత్రాల గురించిన వర్ణనలు ఈ పురాణంలో కనిపిస్తాయి.
*గరుడ పురాణం*: గరుడుని వివిధ సందేహాలపై విష్ణువు చెప్పిన వివరణ ఇది. ఇందులో గరుడుని జన్మవృత్తాంతంతోబాటు జనన మరణాలంటే ఏమిటి, మరణానంతరం జీవుడు ఎక్కడికి వెళతాడు; ఏ పాపానికి ఏ శిక్షపడుతుంది... వంటి విషయాలుంటాయి.
*వాయుపురాణం*: వాయుదేవుడు చెప్పిన ఈ పురాణంలో ఈశ్వరుని మాహాత్మ్యం, భూగోళం, సౌరమండల వర్ణనలు కన్పిస్తాయి.
*అగ్నిపురాణం*: అగ్నిదేవుడు వశిష్టునికి చెప్పిన ఈ పురాణంలో వ్యాకరణం, ఛందస్సు, వైద్యశాస్త్ర రహస్యాలు, జ్యోతిశ్శాస్త్రం, భూగోళ, ఖగోళ రహస్యాలను తెలుసుకోవచ్చు.
*స్కాందపురాణం*: కాశీఖండం, కేదారఖండం, కుమారిల ఖండం, రేవాఖండం... తదితర ఖండాలుగా ఉండే ఈ పురాణాన్ని స్కందుడే చెప్పాడట. ఇంకా రామేశ్వర క్షేత్ర మహిమ, పూరీ జగన్నాథ ఆలయంతో సహా అనేక పుణ్యక్షేత్రాల గురించిన వర్ణనలుంటాయి. ఇంకా కుమారస్వామి జననం, మహిమలు, శివలీలల ఉంటాయి.
*లింగపురాణం*: లింగరూప శివ మహిమలతోబాటు, వివిధ వ్రతాలు, ఖగోళ, జ్యోతిష, భూగోళాల గురించిన సమాచారం ఉంటుంది.
*నారద పురాణం*: బహ్మమానసపుత్రులైన సనక సనంద సనాతన సంపత్కుమారులకు నారదుడు చెప్పిన ఈ పురాణంలో వేదాంగాల గురించి, పలు పుణ్యక్షేత్రాల గురించిన వర్ణనలుంటాయి.
*పద్మపురాణం*: ఈ పురాణంలో మధుకైటభులనే రాక్షస వధ, రావిచెట్టు మహిమ, పద్మగంధి దివ్యగాథ, గంగా మహాత్మ్యం, గీతాసారం, నిత్యపూజావిధానాల గురించి ఉంటుంది.
*విష్ణుపురాణం*: పరాశరుడు తన శిష్యుడైన మైత్రేయునికి బోధించిన ఈ పురాణంలో విష్ణుమూర్తి అవతార వర్ణన, ధ్రువ, ప్రహ్లాద, భరతుల చరితామృతం ఉంటుంది.
*మార్కండేయ పురాణం:* శివకేశవుల మాహాత్మ్యం, ఇంద్ర, అగ్ని, సూర్యుల మాహాత్మ్యం, దేవీ మాహాత్మ్యం వుంటాయి.
*బ్రహ్మపురాణం*: బ్రహ్మదేవుడు దక్షునికి బోధించిన ఈ పురాణంలో వర్ణధర్మాలు, స్వర్గనరకాల గురించి తెలుసుకోవచ్చు.
*భాగవత పురాణం*: విష్ణువు అవతారాలు, శ్రీ కృష్ణ జననం, లీలల గురించి మృత్యువుకు చేరువలో ఉన్న పరీక్షిన్మహారాజుకు శుకమహర్షి చెప్పిన పురాణమిది. దీనిని తొలుత వేదవ్యాసుడు శుకునికి బోధించాడు.
*బ్రహ్మాండ పురాణం*: బ్రహ్మదేవుడు మరీచి మహర్షికి చెప్పిన ఈ పురాణంలో రాధాకృష్ణులు, పరశురామ, శ్రీరామచంద్రుల చరిత్రలు, లలితా మహిమ్నా స్తోత్రం, ఖగోళ విజ్ఞానం గురించిన వివరణ ఉంటుంది. *భవిష్యపురాణం:* సూర్యుడు మనువుకు చెప్పిన ఈ పురాణంలో అగ్ని, సూర్యోపాసన విధులతోబాటు, భవిష్యత్తులో జరుగబోయే వివిధ విషయాల గురించిన వివరణ ఉంటుంది.
*బ్రహ్మాపవైపర్తపురాణము*
ఇందులో గోలోకప్రశంస . భోజననియమాలు.రోగనివృత్తిసాధనాలు.తులసీ, సాలగ్రామమహత్త్వాలు.హోమములోస్వాహకార ప్రాధాన్యము మొ. విషయాలు ఇందువివరించబడ్డాయి.
🙏🙏🙏🙏
Wednesday, February 8, 2017
*పౌర్ణమికి, అమావాస్యకు గల భేదం ఏమిటి…?*
*పౌర్ణమికి, అమావాస్యకు గల భేదం ఏమిటి…?*
🌚🌝🌚🌝🌚🌝🌚🌝🌚🌝🌚🌝🌚🌝
పౌర్ణమి రాత్రికీ, మరో రాత్రికీ ఎంతో భేదం ఉంది. కాస్త పిచ్చి ఉన్నవాళ్లకి ఈ భేదం బాగా తెలుస్తుంది…! ఇది ఎందుకు జరుగుతుందో చూద్దాం. ఇది మైక్రోఫోన్లో ధ్వనిని పెంచినట్లు. సంభాషణ అదే అయినా ఉన్నపాటుగా ధ్వని పెరుగుతుంది, అంతా స్పష్టమవుతుంది. అదే విధంగా ముందే కొంచెం పిచ్చి ఉన్నట్లయితే దానికి మరి కొంచెం శక్తి ఇస్తే చాలు, ప్రతిదీ ఒక్కసారి పెరిగిపోయినట్లు అనిపిస్తుంది. పౌర్ణమి రోజున శక్తి కొంచెం ఎక్కువగా ఉంటుంది. పిచ్చి మాత్రమే కాదు ఎక్కువయ్యేది, మీరు ప్రశాంతంగా ఉంటే ఆ ప్రశాంతత కూడా పెరుగుతుంది. మీరు ఆనందంగా ఉంటే ఆ ఆనందం కూడా పెరుగుతుంది. మీ లక్షణం ఏదైతే, అది పెరుగుతుంది. జనం పిచ్చిని తేలిగ్గా గమనిస్తారు, ఎందుకంటే చాలామంది ఆ స్థితిలోనే ఉంటారు కాబట్టి. కాని మీరు ప్రేమించే వ్యక్తులయితే మీ ప్రేమ కూడా పౌర్ణమినాడు ఉప్పొంగుతుంది.
మీరు దేనివైపైనా చూసినప్పుడు, అది మీకు అందమైనదైతే, ఆ వస్తువును గ్రహించే సామర్థ్యం మీకు అకస్మాత్తుగా పెరుగుతుంది.
శక్తిని అధికతరం చేసేదేమిటి? దీనికి ఒక కారణం ఏమిటంటే, నిర్దిష్టమైన సౌందర్యలక్షణం. మీరు దేనివైపైనా చూసినప్పుడు, అది మీకు అందమైనదైతే, ఆ వస్తువును గ్రహించే సామర్థ్యం మీకు అకస్మాత్తుగా పెరుగుతుంది. దేన్నైనా మీరు అసహ్యమైన వస్తువనుకుంటే, మీరు దాన్ని చూసిన క్షణంలో మీ గ్రహణా సామర్థ్యం తగ్గుతుంది. పౌర్ణమిలో ఒక విశిష్టసౌందర్య లక్షణం ఉంటుంది, అది మీ గ్రహణా సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది.
మరొక విశేషం కూడా ఉంది. ఈ గ్రహం(భూమి) తన ఉపగ్రహ(చంద్రుడు) స్థితికి సంబంధించి ఒక నిర్దిష్ట స్థానంలోకి కదిలినప్పుడు ప్రకంపనలు మరింత సూటిగా, తీవ్రంగా ఉంటాయి. చంద్రుడి ఆకర్షణశక్తి తన వైపు లాక్కోవడం వల్ల అలలు పైకి లేస్తాయి. నీళ్లు ఉప్పొంగి పైకి లేవడానికి ప్రయత్నిస్తాయి. అదే విధంగా మీ రక్తం కూడా ఉప్పొంగుతుంది, దూకడానికి ప్రయత్నిస్తుంది. మీ మెదడులో రక్తప్రసారం పెరిగితే మీలో ఉన్న లక్షణం ఏదైనా సరే, అది పెరుగుతుంది.
*సూక్ష్మశక్తులా లేదా శక్తిమంతమా?*
ఇక అమావాస్య విషయానికి వద్దాం. పౌర్ణమి నాటి ధ్యానానికి, అమావాస్య నాటి ధ్యానానికీ చాలా తేడా ఉంటుంది. ధ్యానం చేసే వ్యక్తికి పౌర్ణమి మంచిది. కాని కొన్ని క్రతువులూ, ప్రక్రియలకు అమావాస్య రోజు మంచిది. అమావాస్య రాత్రులలో మీ శక్తులు క్రూరంగా ఉంటాయంటారు; మదమెక్కిన ఏనుగు లాగా మీ శక్తులు పిచ్చెక్కినట్లు ప్రవర్తిస్తాయి. అందుకే అమావాస్య రాత్రులను తాంత్రికులు ఉపయోగించుకుంటారు. అది శక్తులను కదిలిస్తుంది. పౌర్ణమిరాత్రులు మరింత మృదువైన స్వభావం కలిగి ఉంటాయి. సుందరంగా, సుఖంగా, సంతోషంగా – ప్రేమ లాగా ఉంటాయి. అమావాస్య శక్తి స్థూల శక్తి. మీరు ఈ రెండు శక్తుల్నీ పోల్చదలచుకుంటే అమావాస్యని కామాన్ని ప్రేరేపించేదిగాను, పౌర్ణిమ ప్రేమను పెంపొందిచేదిగా చెప్పవచ్చు. అమావాస్య నాడు శక్తి స్థూలమైనది, కానీ ఎంతో శక్తిమంతమైంది. పౌర్ణమి నాడు శక్తి సూక్ష్మస్వభావం కలిగి ఉంటుంది. ఎంత సూక్ష్మంగా ఉంటుందంటే, మీరు శక్తిని అనుభూతి చెందలేరు. కుండలిని కూడా ఇట్లాగే ప్రవర్తిస్తుంది: పౌర్ణిమినాడు అది అతి మెల్లగా కదులుతుంది, అమావాస్యనాడు వేగంగా, ఉద్ధృతంగా కదులుతుంది. అమావాస్యలో తీవ్రత ఎక్కువ.
ధ్యానం చేసే వ్యక్తికి పౌర్ణమి మంచిది. కాని కొన్ని క్రతువులూ, ప్రక్రియలకు అమావాస్య రోజు మంచిది.
పౌర్ణమి అద్భుతమైన ఉపస్థితి. చంద్రుని ఉపస్థితి ఎంత స్పష్టంగా ఉంటుందంటే మీరు ఎటు చూసినా ప్రతిదీ పారదర్శకమవుతుంది. అది కలిగించే ప్రకంపన, ప్రకాశాలకు ప్రతిదానికీ ఒక నూతనమైన కాంతిమత్వాన్ని కలిగించే లక్షణం ఉంటుంది. పూర్ణచంద్రుడు మనలో కలిగించే ప్రకంపనలు, అనుభూతి, చంద్రుడి తక్కిన దశలకంటే భిన్నంగా ఉంటుంది. మీలోని ఇడ, పింగళలు భిన్నరీతిలో పనిచేస్తాయి. ప్రాణశక్తి భిన్నమైన రీతిలో ప్రవహిస్తుంది. ప్రకంపనలు మారతాయి కాబట్టి మీలోని శక్తి అంతా భిన్నపద్ధతిలో ప్రవహిస్తుంది.
మీరు ప్రతిరోజూ పౌర్ణమిలో ఉండలేరని కాదు, ఉండవచ్చు. మీ సూర్యచంద్రుల మీద – ఇడ, పింగళ మీద – మీకు ఆధిపత్యం ఉంటే గ్రీష్మతాపంలో కూడా పౌర్ణమి సౌందర్యం మీలో ఉంటుంది. మీకు నిర్దిష్ట ఆధిపత్యం, నియంత్రణ ఉంటే మీరు రోజూ పౌర్ణమినే ఎంపిక చేసుకోవచ్చు, లేదా మీరు ప్రతిరోజునూ అమావాస్యగా చేసుకోవచ్చు. లేదా మీరసలు ఏ ఎంపికా చేసుకోకుండా, ప్రకృతిలో జరిగే జీవితపు అన్ని దశలనూ యథాతథంగా మీరు ఆనందించవచ్చు.
*ఉపస్థితి – అనుపస్థితి*
పౌర్ణమి అద్భుతమైన ఉపస్థితి. అమావాస్య అనుపస్థితి. తార్కికంగా ఆలోచించే బుద్ధి ఎల్లప్పుడూ ఉపస్థితిని శక్తిమంతం గాను, అనుపస్థితిని శూన్యంగానూ భావిస్తుంది. కాని అది అలా కాదు. వెలుగుకు శక్తి ఉన్నట్లే, వెలుగు లేకపోవడానికి అంటే చీకటికి దాని శక్తి దానికుంటుంది. వాస్తవానికి చీకటికి వెలుగుకంటే ఎక్కువ శక్తి ఉంటుంది, కదూ! రాత్రి శక్తి పగటికంటే ఎక్కువ. ఎందుకంటే చీకటి అనేది కేవలం ‘లేకపోవడం’. చీకటి ఉందనడం పొరపాటు. వెలుగు లేదనాలి. ఆ ‘లేకపోవడం’ ఒక వశీకరించుకోగలిగిన ఉపస్థితి. అదే ఇక్కడా జరగవచ్చు.
మీరు ఎరుకతో ధ్యానంలో నిమగ్నులైనప్పుడు, అంటే – మీరు అనుపస్థితిలోకి వెళ్లిపోతారన్నమాట. మీరు అనుపస్థితిలో ఉన్నప్పుడు, మీ ఉపస్థితి అద్భుతమవుతుంది. మీరు ఉపస్థితిలో ఉండే ప్రయత్నం చేసినప్పుడు మీకసలు ఉపస్థితే ఉండదు. అహానికి ఉపస్థితి లేదు. మీరు అనుపస్థితులైనప్పుడు, అక్కడ అద్భుతమైన ఉపస్థితి ఉంటుంది. అమావాస్య విషయంలోనూ ఇదే వాస్తవం. క్రమంగా చంద్రుడు అదృశ్యమవుతాడు, ఆ చంద్రుని అనుపస్థితి ఒకవిధమైన శక్తని సృజిస్తుంది. అందుకే అమావాస్యకు ప్రాధాన్యం.
కష్టపడి పనిచేసే దృఢమైన, కఠినమైన వ్యక్తికి అమావాస్య కచ్చితంగా ముఖ్యమైన అంశం. అట్లాగే చాలా సున్నితమైన, మృదువైన వ్యక్తికి పౌర్ణమి. రెండింటికీ వాటి వాటి శక్తి ఉంది. లక్షణాల విషయం పరిశీలిస్తే పౌర్ణమి ప్రేమపూరితం, అమావాస్య కార్యసాధన(దూకుడు). కాని మనం రెండింటినీ ఉపయోగించుకోవచ్చు. ఈ రెండూ కూడా శక్తే.