పురాణాలలో విడ్డూరాలు - నిజానిజాలు
ముందుగా ఒక చిన్న కధ చెప్పుకుందాం. (పాపం శమించు గాక )
ఏదో చిన్న గొడవ వలన క్రీ.శ.2090లో మూడవ ప్రపంచ యుద్ధం జరిగింది. ఇంచుమించు అన్ని బలవత్తరమైన దేశాల వద్ద అణ్వాస్త్ర సంపద వున్నాయి. అందరూ యుద్ధంలో పాల్గొని ఒకరి మీదకొకరు ఈ అస్త్రాలు సంధించుకున్నారు. కొన్ని ఉత్తర దక్షిణ ధ్రువాల మీద కూడా పడ్డాయి. అక్కడున్న మంచుకొండలన్నీ కరిగిపోయి ఒక్కసారి మొత్తం ప్రపంచమంతా జలప్రళయంలో మునిగిపోయాయి. దాదాపు అన్ని దేశాలు నీటమునిగిపోయాయి. అన్ని భవనాలు అగ్నికీలలో దగ్ధమయి తరువాత జల ప్రళయం వలన మునిగిపోయి, ఎక్కడనుండో కొట్టుకువచ్చిన మట్టితో కప్పబడిపోయాయి. ఈ భీభత్సం ఒక పది రోజులు జరిగాక మరల మామూలుగా నీరు తీసేసింది.వాతావరణం అంతా మారిపోయింది. దేవుని దయ వలన కొందరు మాత్రం ఎత్తైన కొండ గుహలలో, కొన్ని జీవ జంతుజాలం గుహలలోనో ఎక్కడో నక్కి ప్రాణం దక్కించుకున్నారు. వారు బయటకు వచ్చి చూస్తె కొత్త ప్రపంచం, మొత్తం మారిపోయి కనబడుతోంది. ఆకలేస్తోంది. వారు చెట్టులు, పుట్టలు వెతికి వారికేమైనా దొరికితే తింటూ బ్రతుకుతున్నారు. వారిలో కొంతమంది కొన్ని గుహలలోను, లేదా వారిదగ్గరున్న పుస్తకాలలోనూ వారు చూసిన ప్రపంచం గురించి రాసారు. అప్పుడు రాకెట్స్ ఉండేవని, ఎలా ఉండేవో నమూనాలు రాసుకున్నారు, దూరంగా వున్నవాళ్ళతో ఫోన్లో మాట్లాడేవారని, టీ వీలు, ఇంటర్నెట్, వగైరా, వగైరా గురించి రాసుకున్నారు. టెస్ట్ ట్యూబ్ బేబీల గురించి, ఎలా చికిత్స చేసేవారో, ఆపరేషన్లు, ఇతర జీవన ఆరోగ్యం గురించి ఎన్నో రాసుకున్నారు. అవన్నీ ఒక చోట భద్రంగా దాచుకున్నారు. నేడు వారికి తిండి దొరకడమే ప్రధానం. అన్నీ పోవడంతో వారు కేవలం కొన్ని ఆకులు కప్పుకుని బతుకుతున్నారు. వారికున్న జ్ఞానంతో కొన్ని ఇళ్ళు కట్టుకున్నారు. వారి సంతానానికి విషయం చెప్పారు. కానీ తిండి కోసం వారు మరిన్ని ప్రదేశాలను వెతుక్కుంటూ వెళ్ళిపోయారు.
ఇలా ఒక పది తరాలు గడచి పోయాయి. అప్పుడు వారిలో ఒకడు వీరు ముందున్న ప్రదేశానికి వచ్చాడు. అక్కడ కొన్ని పాడుబడ్డ ఆవాసాలు కనబడ్డాయి, శిధిలమై. వాటిలో వాడికొక పుస్తకం దొరికింది. దానిలో ఎలా జీవించాలో రాసుంది, అంతకు ముందు ఎలా జీవిన్చారో రాసుంది. ఇవన్నీ తీసుకొచ్చి వాళ్ళ తెగలో కొంతమందికి చెప్పాడు. భగవంతుడిని ఎలా ఆరాదిన్చేవారో తెలుస్కుని, వారు కూడా ఆ పద్ధతి పాటించారు. ఇదే భూగోళానికి అటువైపు కూడా కొంత మంది బ్రతికి బట్ట కట్టారు. వాళ్ళు ఎప్పుడో వీళ్ళను కలుసుకున్నారు. వాళ్ళు వీళ్ళ దగ్గరున్న పుస్తకాలలో విషయాల గురించి విన్నారు. అప్పట్లో గాల్లో వేల్లెవారట, ఇది నమూనా అంటే పొట్ట చెక్కలయ్యేలా నవ్వారు. తిండే దొరకని మనకు ఈ కట్టు కధలు అవసరమా అంటూ గేలి చేసారు. ఈ తెగ వాళ్ళనందరినీ పిట్టకధల దొరలూ అని ముద్ర వేసారు. వారి జీవన విధానాన్ని వెక్కిరించారు. వారి గ్రంధాలను తిట్టారు. అప్పుడు విమానాలుంటే ఇప్పుడెక్కడికి పోయాయి. ఏది నువ్వొకటి తయారు చెయ్యి అన్నారు. కానీ అప్పుడు కరెంటు లేదు, ఎలక్ట్రానిక్స్ లేదు, ఏమి లేదు. వారికి ఆ జ్ఞానం లేదు. వీళ్ళు ఇప్పుడు ఆ పుస్తకాలలో విషయాన్ని ప్రాక్టికల్ గా చూపలేకపోతున్నారు కాబట్టి వీళ్ళవన్నీ కాకమ్మ కబుర్లు అని, వీళ్ళు వట్టి వెధవలోయ్ అని ముద్ర వేసారు. అవును నిజమే అని ఈ తెగలో కొంతమంది మిగతా వారిని ఎద్దేవా చేస్తున్నారు. ఆస్తిక నాస్తిక మతాలు పుట్టాయి. ఆ పుస్తకాలు నమ్మిన వాళ్ళు వెర్రి వెంగలప్పలు నమ్మనివాళ్ళు ఆధునీకులు అని పేర్లు పెట్టుకున్నారు.
పైదంతా చదివితే మీకేమైనా గుర్తుకొస్తోందా? ఈ రోజున జరుగుతున్న విషయం స్ఫురిస్తోందా? మన వాంగ్మయంలో చెప్పారు ఒకప్పుడు పుష్పక విమానంలో విహరించారట అంటే అదొక కట్టు కధ. ఒకప్పుడు రాజ్యాలలో ఈ విధంగా రాజ్యం చేసారట అంటే మరొక పిట్ట కధ. అస్త్ర, శాస్త్రాలతో యుద్ధం చెయ్యగలిగేవారట. సమయం ఇలా గణించారు, శస్త్రచికిత్సలు చేసారు, కుంభ సంభవులు పుట్టారు అంటే ఇవన్నీ mythology అని కొట్టి పారేస్తున్నారు. మంత్రప్రభావం, ప్రాభవం ఇదంటే దాని మీద నమ్మకం లేక చింతకాయలు రాల్చమంటున్నారు. జలప్రళయం వచ్చి అందరూ మునిగిపోతే ఒక మనువు బ్రతికాడని, తరువాత ఎందరో మహర్షులు వచ్చి మనకొక జీవన విధానం నేర్పారు అని మన పురాణం చెబుతోంది.. నిత్యసత్యాలన్నీ మన వాంగ్మయంలో, గ్రంథాలలో ఉన్నాయంటే నమ్మి పాటించిన వారు ఒక 8000 ఏళ్ళ క్రితం ఎలా వుండేవారో నేడు కొన్ని తవ్వకాలలో బయట పడ్డాయి. అదే మనకు అవతలి వైపు వాళ్ళు అప్పటికి అడవి పందులు వేటాడుకుంటూ వుండేవారు కనీసం 1000 సంవత్సరాల క్రితం వరకు. కాలక్రమేణా వారు కొన్ని కనిపెట్టారు, మనం అందరం వాడుకుంటున్నాం. అది నిజం, ఇదీ నిజం. కానీ పురాతన గ్రంథాలలో ఎలా ఉండేదో అప్పటి మన మనుష్యుల జీవనం, న్యాయం, ధర్మం జీవన విధానం, శాస్త్ర దృక్పధం ఆరోగ్య పరిరక్షణ విధానం అన్నీ రాసి వుంది. దేవుడిని ఎలా చేరాలని రాసి వుంది. దాన్ని నమ్మి పట్టుకున్న మనం తప్పక సాధించగలం. కావలసినదల్లా దాని మీద నమ్మకం. వారు చెప్పిన విషయాలను పూర్తిగా అర్ధం చేసుకోగల సామర్ధ్యం కావాలి. వాటి గురించి మనం మరింత లోతుగా పరిశీలించాలి. శోధించాలి, సాధించాలి. అంతేకానీ మనకు మనం తక్కువ అంచనా వేసుకుని మనం ఆత్మన్యూనతా భావం పనికిరాదు. మన మీద, మన గ్రంథాలపై, మన పురాణాల మీద మనకు నమ్మకం, గౌరవం వుండాలి. కాదంటారా?
మీకోసం ఈ లంకె.
http://timesofindia.indiatimes.com/…/articlesh…/52485332.cms
!! ఓం నమో వేంకటేశాయ !!
!! సర్వం శ్రీ వేంకటేశ్వరార్పణమస్తు !!